కలర్ టీవీ ఇండియాకొచ్చి..

కయ్యం బెట్టిందిరో కలర్ టీవీ ఇంటికొచ్చి.. దయ్యం బట్టిందిరో నా పెళ్లం పోరలకు.. అంటూ ప్రజా కవి గద్దర్ రాసి పాడిన పాట సామాన్యుల్లో ఎంతో ఫేమస్ అయింది. ఆ పాటలో సామాన్యుల ఇళ్లల్లోకీ కలర్ టీవీ వచ్చి వారి జీవనంపై ప్రభావం చూపిందని చెప్పారు. అలాంటి కలర్ టీవీ మన దేశంలోకి వచ్చి సరిగ్గా 40 ఏళ్లయింది.

పాశ్చాత్య దేశాల్లో అప్పటికే వచ్చిన కలర్ టీవీని మన దేశంలోకి అనుమతించాలా.. వద్దా.. అన్న విషయంలో భారత పార్లమెంటులో సుధీర్ఘ చర్చ జరిగింది.

1982 అక్టోబరు నెలలో న్యూఢిల్లీలో ఏషియన్ గేమ్స్ ఉండటంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కలర్ టీవీల దిగుమతికి అనుమతి ఇచ్చారు.

అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ప్రధాని ఇందిరాగాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఈ మేరకు 1982 ఏప్రిల్ 25న మన దేశానికి కలర్ టీవీలు పరిచయం అయ్యాయి. ఈ 40 ఏళ్ల కాలంలో ఎల్సీడీ, ఎల్ఈడీతో పాటు అత్యాధునిక టీవీలు మనకు అందుబాటులోకి వచ్చాయి.