Telangana CM.. రేవంత్ స్థానంలో తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు?

రచ్చబండ ప్రతినిధి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలపై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్రంలో ప్రధానంగా ముక్కోణపు పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో అంటే 9 నుంచి 14 సీట్లలో గెలుపుపై ధీమాతో ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తామని తొలి నుంచి చెపుతున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రెండు పార్టీలకు తీసిపోని విధంగా మెజార్టీ స్థానాల్లో గెలుస్తామన్న భరోసాతో ఉన్నది. సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించినప్పటికీ కొన్ని సంస్థలు, టీవీ చానళ్ళు అటూ ఇటుగా అంచనాలను విడుదల చేశాయి. ఈ అంచనాలు వాస్తవాలా? కాదా? అన్న విషయం పక్కన పెడితే కాంగ్రెస్ లో బీజేపీ గుబులు పట్టుకున్నది. తమ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయేమోనని ఏదో ఓ మూలన కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకున్నది.

వాస్తవంగా కాంగ్రెస్ ఈ ఐదు నెలల పాలనపై ప్రజల్లో అసంతృప్తి కలిగింది అనడం కంటే సంతృప్తి అయితే కలగలేదు. ముక్యంగా యాసంగి పంటలకు సాగునీటి కొరత, పంట దిగుబడులకు తగ్గిన ధరలు, కొనుగోళ్లలో లోపాలపై కొంత వ్యతిరేకత ఉన్నదని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్న మాట. ఈ దశలోనే తక్కువ సీట్లు వస్తాయని, బీజేపీకి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య విజయాలు దక్కుతాయని కూడా కొందరు చెప్తున్నారు.

ఈ సమయంలో కాంగ్రెస్ కు బీజేపీ కన్నా, బీఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు వస్తే సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయొచ్చని అయన వ్యతిరేక వర్గం కాచుకొని కూర్చున్నదని రాజకీయ విశ్లేషకులు సైతం కాదనలేని అంశం. ఎవరెన్ని చెప్పినా సీఎంగా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా నిలదొక్కుకున్నారని మాత్రం అయన వర్గం వాదన. దీనిని ఎవరూ కొట్టిపారేయలేరు కూడా. అయితే ఎన్నికల ఫలితాలతో పాటు రేవంత్ పై అయన వ్యతిరేక వర్గం ఇప్పటికే కొన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరవేసిందని గుసగుసలు. అవేంటంటే? ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నగా సంబోధిచించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలిశారన్నది వారి ఆక్షేపణ. అదే విధంగా ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ లోకి వెళ్తారని ప్రధాన ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణనూ వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ చీలికకు మరో వర్గం రెడీగా ఉన్నదన్న ఉద్దేశంతో ముందే దూకేయొచ్చని కొందరి వాదన.

వీటిని టేకిట్ ఈజీగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నా, ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపడితే సక్సెస్ ఫుల్ లీడర్ గా రేవంత్ రెడ్డిని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని కూడా అనుకోవచ్చని కొందరి అభిప్రాయం. రాష్ట్రంలో చేపట్టిన అయన పథకాలను కేంద్రంలో అమలు కోసమూ ఆయనను కేంద్ర మంత్రిగా తీసుకోవచ్చని వారి వాదన. దక్షిణాది నుంచి బలమైన లీడర్ గా అయన ఎంపిక సరైనదేనని భాగస్వామ్య పక్షాలూ కాదనలేరని అంచనా.

వీటన్నింటినీ క్రోడీకరించి కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ తెలంగాణ సీఎంను మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఎవరిని ఆ పదవి వరిస్తుందనేది చర్చనీయాంశం. ఈ దశలో ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఎవరో ఒకరు ఉండి ఉంటారని భావిస్తున్నారు. తొలి దశలో రేవంత్ తో పాటు సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీ పడ్డారు. చివరికి రేవంత్ నే ఆ పదవి వరించింది. ఇప్పుడు కూడా వారిద్దరే పోటీ పడవచ్చని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలిసిందే. అయితే దళిత నేతకు అవకాశం ఇవ్వాల్సి వస్తే మాత్రం మల్లు భట్టి విక్రమార్కకే ఆ చాన్స్ దక్కే అవకాశం ఉంటుందని భావన. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని చెప్తున్నారు.

అయితే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం క్యాండిడేట్ మారే చాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రేవంత్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లను బలపర్చకపోవచ్చని వారి అభిప్రాయం. పొంగులేటిని కూడా సూచించక పోవచ్చని అంటున్నారు. కోమటిరెడ్డి వైపే రేవంత్ మొగ్గు చూపొచ్చని విశ్లేషిస్తున్నారు. లేదా జానారెడ్డి లేదా ఎవరైనా ఒక సీనియర్ పేరు సూచించవచ్చని వాదిస్తున్నారు.

ఏదైతేనేమి ఇప్పుడైనా, ఇంకొన్నాళ్ళకు అయినా సీఎం మార్పు అంశం తెరపైకి వస్తే మాత్రం ఇదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.