చదవాలన్న తపన గోల్డ్ మెడల్ విజేతగా నిలిపింది

* విమర్శలనే విజయాలుగా మలచిన డాక్టర్ బంటు కృష్ణ

* ఆచరణ లేని మాటలు ఎన్ని చెప్పినా గమ్యం చేరడం అసాధ్యం

* అవిరళ కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నిరంతర చదువరి డాక్టర్ బంటు కృష్ణ

* తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతిలాల్ నాయక్

* జర్నలిస్ట్ కృష్ణను ఘనంగా సన్మానించిన తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం

సూర్యాపేట, రచ్చబండ: చదవాలన్న తపన, ఆరాటం డాక్టర్ బంటు కృష్ణను గోల్డ్ మెడల్ విజేతగా నిలిపిందని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతిలాల్ నాయక్ అకొనియాడారు. జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతోపాటు రాష్ట్రస్థాయిలో సూర్యాపేట పేరు మారుమోగేలా గోల్డ్ మెడల్ కూడా సాధించి రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.

అవిరళ కృషితో అసాధ్యాన్ని జర్నలిస్టు కృష్ణ సుసాధ్యం చేశాడని, విమర్శలను విజయాలుగా మలుచుకుని ఇంత పెద్ద ఘనతను సాధించాడని ఆయన ప్రశంసించారు. మాటలు ఎందరో చెప్తారని, కొందరు మాత్రమే ఆచరణ లో పెట్టి గమ్యానికి చేరుకుంటారని, అలాంటి వారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాదిరిగా ఆయన బాటలోనే నడుస్తున్న నిత్య చదువరి అయిన మనలో ఒకటైన డాక్టర్ బంటు కృష్ణ సూర్యాపేట పేరు, ప్రతిష్టలు ఇనుమడింప చేసేలా విద్యా రంగంలో అగ్ర శిఖరాన్ని చేరుకోవడం మన అందరికీ గర్వకారణం అన్నారు. ఓటమి విజయానికి నాంది అని, ఎన్ని ఫెయిల్యూర్స్ చవిచూసినప్పటికీ అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, మొక్కవోని ధైర్యంతో విజయం సాధించే వరకు పోరాడడం గొప్ప విషయం అన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్, గెజిటెడ్ ఉపాధ్యాయులు ధరావత్ వస్త్రం నాయక్, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర బగ్గులాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ ఉపాధ్యక్షులు బానోతు లింగ నాయక్, సర్పంచ్ ధరావత్ రవి నాయక్, లారీ అసోసియేషన్ అధ్యక్షులు భూక్య ఉపేందర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్యానాయక్, పెన్ పహాడ్ మండల ప్రధాన కార్యదర్శి సకృనాయక్, రాంజీ నాయక్, లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.