వామ్మో జనంలో కేసీఆర్ క్రేజీ మామూలుగా లేదుగా! సీఎం.. సీఎం.. అంటూ నినాదాల హోరు.. తగ్గని జన హోరు (కేసీఆర్ పొలం బాట చిత్రమాలిక)

రచ్చబండ, హైదరాబాద్: సీఎం.. సీఎం.. అంటూ నినాదాల హోరు.. జన నేతను చూసేందుకు జనంలో తగ్గని హుషారు.. జై కేసీఆర్ అంటూ రణ నినాద జోరు. ఉవ్వెత్తున ఎగిసిన గులాబీ శ్రేణుల క్రేజీ మామూలుగా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాలి శాస్త్ర చికిత్స కారణంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి రెండుసార్లు మినహా బయటకు రాలేక పోయారు. సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆదివారం చేపట్టిన రైతుకు బాసటగా పొలం బాట కార్యక్రమం ఆసాంతం జనంనుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి క్రేజీని చూపడం విశేషమే.

సాధారణంగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనను వీడి ఎందరో ముఖ్యమైన నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోతున్నారు. ఈ దశలో జనంలో ఆయనకు ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఈ పర్యటనే నిదర్శనంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలు దేరినప్పటి నుంచే జనం ఊరూరా ఎదురేగి స్వాగతం పలకడంపై విమర్శకులు సైతం కాదనలేని సత్యం. బస్సులో ముందు సీట్లోనే కూర్చున్న కేసీఆర్ ను చూసిన ఎందరో అభిమానులు, శ్రేణులు భావోద్వేగంతో నినాదాలు చేయడం, అభిమానాన్ని ప్రదర్శించడం చూస్తే జనంలో ఆయనకు ఉన్న అభిమానం ఇంకా తగ్గలేదని నిరూపితమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని దీంతో యిట్టె తెలిసిపోతుంది.

పొలాల పరిశీలన సమయంలోనూ ఆయనను చూసేందుకు, ఆయనను తాకేందుకు సామాన్య జనం, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రైతులు సైతం తాపత్రయపడ్డారు. ఈ దశలో అయన పక్కన ఉన్న ముఖ్య నేతలను సైతం వారు లెక్క చెయ్యలేదు. నినాదాలు చేస్తూ అయన వెంట ఆసాంతం సాగిపోయారు. వారిని ఓదారుస్తూ భరోసా ఇస్తూ కేసీఆర్ పర్యటన సాగింది.