కటిక పేదయై.. కాటికి చేరువై..!

• వెన్నెముఖ వ్యాధితో జీవచ్ఛవమైన వెంకటాపూర్ వాసి
• సొంతిల్లు లేదు.. అద్దెల్లు పొమ్మంది..
• శ్మశానంలో ఉంచి చావు కోసం ఎదురుచూపు
• దిక్కుతోచని స్థితిలో తల్లి, భార్య

వెన్నెముఖ వ్యాధితో జీవచ్ఛవమైన ఓ వ్యక్తిని శ్మశానంలో ఉంచి చావు కోసం ఎదురుచూస్తున్న వైనం. ఆశలు లేవు.. ఆస్పత్రి నుంచి తీసుకెళ్లమంటూ చెప్పారు. సొంతిల్లు లేదు. అద్దె ఇంటికి తీసుకొస్తే ససేమిరా అంటూ ఖాళీ చేయించారు. ఇక చేసేదిలేక శ్మశానంలో చావు కోసం ఆయన భార్య, తల్లి ఎదురుచూస్తున్న హృదయవిదారక ఘటన ఇది.

వెంకటాపురం (రామప్ప) : ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన కేసోజు లక్ష్మణాచారి గతంలో వృత్తిపనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య, తల్లి, కూతురు ఉంది. కూతురుకు పెళ్లి జరిపించారు. అయితే ఇటీవల కిందపడి వెన్నెముక విరిగింది.

వరంగల్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బతికే ఆశలు లేవని చెప్తే తన స్వగ్రామానికి వెంకటాపూర్ చేరుకున్నారు. గ్రామంలో వారికి సొంతిల్లు లేదు. గత 20 ఏండ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అతడి తల్లి, భార్య కూలిపనులు చేసి కుటుంబాన్ని సాగుతున్న క్రమంలో లక్ష్మణాచారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సమయంలో ఇల్లు యజమాని ఖాళీ చేసి వెళ్లిపోవాలని భీష్మించారు.

కొన ఊపిరితో..
ఎటూ పాలుపోక కొన ఊపిరితో ఉన్న లక్ష్మణాచారిని బుధవారం ఉదయం వెంకటాపూర్ శివారులో ఉన్న శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు. తన కొడుకు లక్ష్మణాచారి అక్కడే తుదిశ్వాస విడుస్తాడని దేవుడిదే భారం అంటూ అతని తల్లి బావురుమంది.

గూడు, నీడ లేక చాలీచాలని జీవితాలతో అర్ధాకలి బతుకులతో కాలం వెళ్లదీస్తున్నామని దు:ఖభారంతో చెప్పింది. ఉదయం నుంచి లక్ష్మణాచారి తల్లి కుటుంబ సభ్యులు విలపిస్తూ అక్కడ ఉన్నారు. కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

లక్ష్మణాచారి కుటుంబాన్ని ఆదుకోవాలి

ఉన్నతాధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిలువ నీడలేని లక్ష్మణాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు. నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు.