తమిళనాడులో ఘోరం

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన తమకు జీవితం నుంచే విముక్తి కలుగుతుందని వారు భావించలేదు. దైవనామ స్మరణతో ముక్తి కలుగుతుందనుకున్న వారికి ఆ దేవుడే మరణ శాసనం రాస్తాడని వారు అనుకోలేదు. ఏదైతేనేమి ఓ ఆలయ రథోత్సవంలో పాల్గొన్న భక్తుల్లో 11 మంది మృత్యువాత పడ్డారు.

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు సమీపంలోని కలిమేడులో మంగళవారం అర్ధరాత్రి ఓ ఆలయ రథోత్సవం జరుగుతోంది. అర్ధరాత్రి ఉత్సవం ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటాక 3గంటలకు భక్తుల జయజయధ్వానాలు అక్కడ మార్మోగుతున్నాయి. రథం ఓ మూల మలుపు తిరుగుతోంది. ఈ సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్.

రథం గోపురం, అలంకరణలు విద్యుత్ హెచ్టీ లైన్ వైర్లకు తాకడంతో రథాన్ని పట్టుకొని ఉన్న 11 మంది చనిపోయారు. వారిలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా 8మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి గాయాలయ్యాయి.

కలిమేడు ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఈ మేరకు మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున, రాష్ట్రం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఇదేరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కలిమేడు ఘటనను పరిశీలించేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.