‘జలదృశ్యం’లో నాడేం జరిగింది?

అది హైదరాబాద్‌ నగరంలోని జలదృశ్యం. 2001 ఏప్రిల్‌ 27వ తేదీ. ఆనాటి డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రత్యేక పార్టీ స్థాపించనున్నారనే వార్తను ఆ నాటి రాజకీయ పార్టీలు తేలికగా తీసుకున్నాయి. గతంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమంలాగే, ఇది కూడా అలాంటి ముగింపు ఇస్తుందని కొందరు నేతలు బాహాటంగానే మాట్లాడారు.

అదేరోజు ఉదయం 9 గంటల సమయం జలదృశ్యంలో ఓ చిన్న వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కొందరు నాయకులు ఏర్పాట్లను చూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ తన కార్యాలయంలోనే ఉన్నారు.

జలదృశ్యం ముందు సాధారణ పరిస్థితులే ఉన్నాయి.
బందోబస్తు కోసం సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి కేవలం ఐదుగురు కానిస్టేబుళ్లు వచ్చారు. హంగులు, ఆర్భాటాల్లేవు. వాతావరణం అంతా చాలా సాధారణంగా ఉంది. అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హుస్సేన్‌సాగర్‌ అలల సవ్వడి తప్ప మరే అలికిడి, అలజడి లేదు.

ఉదయం 9 గంటల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జలదృశ్యం చేరుకున్నారు. అప్పటివరకు వేదిక తయారు కాలేదు. కొద్దిసేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీతో చంద్రశేఖర్ రావు మాట్లాడారు. వేదికపై మైక్‌ అమర్చిన అనంతరం సుదర్శన్‌ రావు (మాజీ మంత్రి రామచందర్‌రావు కొడుకు), హరీశ్‌రావు నాయకులను వేదికపైకి ఆహ్వానించారు.

చేతిలో మూడు కవర్లతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి, శాసనసభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన చేతిలోని కవర్లను చూపిస్తూ తన రాజీనామాలను స్పీకర్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవ్వాలని నాయకులకు చెప్పారు.

ఆ తర్వాత.. దగాపడిన తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపిస్తున్నట్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రాన్ని ‘చిహ్నం’గా ప్రకటించారు. పార్టీని ‘టీఆర్‌ఎస్‌’గాను తనను ‘కేసీఆర్‌’ అని పిలవాలని కార్యకర్తలను, ప్రజలను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరారు.

నాటి నుంచి ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా కేసీఆర్‌ చేసిన తెలంగాణ ఉద్యమం అజరామరం. తెలంగాణలోని ప్రతి కూడలిని ఓ రణక్షేత్రంగా మలచి, దగాపడిన తెలంగాణను పరాయిపాలన నుంచి విముక్తి చేశారు. పార్టీ ప్రారంభ రోజుల్లో కేసీఆర్‌ను విమర్శించిన కొన్ని పార్టీలు తెలంగాణలో ఉనికిని కోల్పోయాయి. గుప్పెడు మందితో పోరాటాన్ని ప్రారంభించి కోట్ల మందిలో ఉద్యమస్ఫూర్తి రగిలించారు కేసీఆర్‌. రాష్ట్ర సాధన కోసం దేశాన్ని కదిలించి గమ్యాన్ని ముద్దాడారు.

ఇక్కడి నుంచే ఓ మహా ఉద్యమం ప్రారంభమై తెలంగాణ చరిత్ర గతులను మారుస్తుందని, తరతరాల తెలంగాణ బతుకులను తీర్చిదిద్దుతుందని ఎవరూ ఆనాడు ఊహించలేదు. తెలంగాణ కోసం కోట్లాది ప్రజలను ఒక్కతాటిపైకి కేసీఆర్‌ తీసుకొస్తారని ఎవరూ అనుకోలేదు.