• మంటగలిసిన మానవత్వం
• తిరుపతిలో హృదయవిదారక ఘటన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని.. అంటూ ఓ కవి తన భావాన్ని వ్యక్తీకరించి సమాజ పోకడలను ప్రశ్నించాడు. మారదు లోకం.. మారదు కాలం.. అంటూ మార్పు రాని ఈ లోకంపై నిప్పుల వర్షం కురిపించాడు. ఆ కవి భావుకత మళ్లీ గుర్తొచ్చేలా జరిగిందీ జుగుప్సాకరమైన ఘటన.
అక్కడ మానవత్వం మంటగలిసింది.. నిజాయితీ దహనమైంది.. దానగుణం దహించుకుపోయింది.. మొత్తంగా మానవత్వం మంటగలిసింది. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన ఘటన.
మన హైందవ సంస్కృతికి ఆలవాలమైన తిరుపతి నగర పరిధిలో ఈ హృదయ విదారకమైన ఘటన జరగడం బాధాకరం. సమాజ పెడ ధోరణులకు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన.
తిరుపతి నగరంలోని రూయా ఆస్పత్రిలో అనారోగ్యంతో ఓ బాలుడు కన్నుమూశాడు. ఆ బాలుడిని 90 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా చిట్వేలి గ్రామానికి తరలించాలి. దీంతో అక్కడి అంబులెన్స్ వారిని సంప్రదిస్తే రూ.20వేలు డిమాండ్ చేశారు.
అసలే కొడుకు చనిపోయి కుమిలిపోతున్న ఆ కుటుంబానికి అంత మొత్తం చెల్లించే స్థోమత లేదు. కనీస చార్జీ చెల్లిస్తానని ఎంతగా వేడుకున్నా ఆ కర్కశకులు కనికరించలేదు. దీంతో బయట నుంచి అంబులెన్సును మాట్లాడుకున్నారు.
అయితే బయట నుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవరుపై రుయా అంబులెన్స్ మాఫియా దాడికి పాల్పడింది. దు:ఖభారంతోనే ఆ తండ్రి వారి కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.
ఆఖరికి గత్యంతరం లేక ఆ రాత్రివేళ.. గుండెలవిసేలా రోదిస్తూ.. ఓ బైక్ పై కన్నబిడ్డ శవంతో 90 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడ్డాడు ఆ తండ్రి. అయితే అక్కడి వారందరూ చూస్తూ నిలబడ్డారే కానీ.. సాటి మనిషికి సాయం చేసేందుకూ ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.
ఇక్కడ చనిపోయింది ఆ పసివాడు మాత్రమే కాదు.. అక్కడ కళ్లప్పగించి చూస్తున్న జీవచ్ఛవాలు.. తలదించుకునే ఈ ఘటన సమాజమా సిగ్గుపడు.. అని ప్రశ్నిస్తోంది.