పేపర్ బాయ్.. ఇదిగో సైకిల్

సాయం అందరూ చేస్తారు.. పలు విధాలుగా చేస్తారు.. ఏదో చేద్దాం.. అని చేసే వారు కొందరు.. పరిస్థితిని చూసి చలించి చేసే వారు ఇంకొందరు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామం మేజర్ పంచాయతీ. ఇదే గ్రామంలో నిరుపేద యువకుడైన నేలపట్ల సైదులు గత కొన్నాళ్లుగా రోజూ కాలినడకన వెళ్తూ ఇంటింటికీ పేపరు వేస్తుంటాడు. సైకిల్ కొనుక్కునే స్థోపత లేక, ఉదయం పేపరు వేయగా వచ్చే కొద్దిపాటితో ఇంటికి సాయంగా నిలుస్తున్నాడు.

అయితే ఇదే విషయాన్ని ఎందరో చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ కూడా అతని సమస్యను గుర్తించలేకపోయారు. కానీ గ్రామస్థులు కొందరు గుర్తించి అదే గ్రామానికి చెందిన జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులకు పేపర్ బాయ్ సైదులు విషయం చేరవేశారు.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు కూడా చూసి చలించిపోయారు. వెంటనే పేపర్ బాయ్ సైదులును పిలిపించి అతని పరిస్థితిని విచారించారు. సైకిల్ కొనుక్కునే స్థోమత లేదనే విషయం చెప్పాడు.

జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.6,500 పెట్టి ఓ కొత్త సైకిల్ ను కొని గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి చేతుల మీదుగా పేపర్ బాయ్ సైదులుకు వితరణగా అందజేశారు. అది చూసి మురిసిపోవడం సైదులు వంతయింది. ఇది కదా నిజమైన సేవ అంటే.. ఇతడు కదా నిజమైన అర్హుడంటే.. ఇలా ఉండాలి కదా సామాజిక సేవంటే.. అని పలువురు మెచ్చుకుంటున్నారు.

సమాజంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని ఆర్థికంగా అదుకున్నప్పుడే సమాజంలో పేద, ధనిక అనే అడ్డుగోడలను తొలగించొచ్చు అని ఫౌండేషన్ కోశాధికారి జోగు అరవింద్ రెడ్డి పేర్కొనడం ముదావహం. ఇలా అసహాయులను గుర్తించి సేవ చేయడం అభినందనీయం.