సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ సస్పెన్షన్

ప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, సౌకర్యాలను కొందరు సర్పంచులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలకు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పొందుపర్చారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ సస్పెండ్ అయ్యారు.

గరిడేపల్లి మండలం మండలం రాయినిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచు దోసపాటి స్వరూప బిక్షంను 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో యాదయ్య తెలిపారు.

గ్రామ పంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ ను తన సొంత వ్యవసాయ పనులకు సర్పంచు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో తేలడంతో నూతన పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల మేరకు సర్పంచుపై చర్యలు తీసుకున్నారు.