జానారెడ్డికి కాంగ్రెస్ కీలక పదవి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ సీరియస్ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చాక వచ్చిన అసంతృప్తులను ఆ పార్టీ అధిష్టానం పెద్దలు నెమ్మదిగా చల్లబరుస్తున్నారు.

ఈ కోవలో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇటీవలే స్టార్ క్యాంపెయినర్ గా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. తాజాగా మరో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది.

మంత్రిగా, సీఎల్పీ లీడర్ గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేతల్లో జానారెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన అనుభవ సారాన్ని పార్టీకి దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలపై ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీకి జానారెడ్డిని చైర్మన్ గా చేయాలని భావించిందని తాజా సమాచారం.

జానారెడ్డి చైర్మన్ గా పని చేయనున్న ప్రత్యేక కమిటీలో సభ్యులుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, మాజీ పీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ ఉంటారు.

వచ్చేనెల 6న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ నగరంలో జరిగే కాంగ్రెస్ నిర్వహించే రైతు సంఘర్షణ బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభ తరువాత పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని నిర్ణయించారు.

జానారెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేయనున్నారు. అలాంటి వారిని గుర్తించి కాంగ్రెస్ లోకి రప్పించే ప్రయత్నం ఈ కమిటీ చేయనుంది.