లోన్ వద్దు నాయనా!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈజీ లోన్ కోసం ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అలాంటి వారిని ఆసరా చేసుకున్న ఎందరో రుణాలు ఎరగా వేసి అధిక వడ్డీ గుంజుతూ గుల్ల చేస్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఇటీవల సాంకేతికత ఆధారంగా కొన్ని బ్యాంకులు, లోన్ ఆధారిత సంస్థలు ఆన్ లైన్ లోనే పని కానిచ్చేస్తున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు కొన్ని మోసపూరిత లోన్ యాప్ లు వచ్చి పడుతున్నాయి. సోషల్ మీడియా గ్రూపులలో వాటిని పొందుపరుస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.

తాజాగా ఒక వ్యక్తి ఓ లోన్ యాప్ భారిన పడి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురానికి చెందిన ఆ వ్యక్తి ఓ లోన్ యాప్లో రూ.3000 రుణం తీసుకున్నాడు. దానికి వడ్డీతో సహా రూ.4,900 చెల్లించాడు.

అదే వ్యక్తి బ్యాంకు ఖాతాలో మరో రూ.14 వేలు అదే యాప్ లోను వాళ్లు జమచేశారు. ఇది చూసి ఖంగుతిన్న ఆ వ్యక్తి తనకు లోన్ వద్దంటూ ఆ సంస్థకు మెయిల్ పంపాడు.

కానీ ఆ సంస్థ ససేమిరా తీసుకోమంది. అసలు రూ.14 వేలకు వడ్డీ రూ.16 వేలు కలిపి మొత్తం రూ.30 వేలు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఎన్ని మెసేజ్ లు పెట్టి వేడుకున్నా వారు కరగలేదు.

దీంతో లోన్ యాప్ నుంచి ఆయన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లకు మెసేజులు, కాల్స్ చేసి తామిచ్చిన లోను తీర్చడం లేదంటూ ఆ వ్యక్తిపై తప్పుడు సమాచారం ఇస్తూ వచ్చారు. దీంతో ఈ విషయం తెలిసి ఎందో మదన పడ్డాడు.

మనో వేదనకు గురైన ఆ వ్యక్తి చేసేదేమీలేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వారికి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

అయితే ఇది ఈ ఒక్కడి సమస్యే కాదు.. ఇప్పటిదే కాదు.. గత కొన్నాళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ఎందరో విసిగి పోయారు. వారిలో చాలా మంది సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

లోన్ ఇచ్చిన ఆ వంచకులు ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోవడంతో ఈ మోసం కొనసాగుతూనే ఉంది. ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ ఇలా మెసం చేస్తూనే ఉన్నారు. మరి ఈ దందాకు ఫుల్ స్టాప్ పడేదెన్నడో వేచి చూడాలి మరి.