జమ్మూ లోయలో ఘోర ప్రమాదం

జమ్మూలోని లడఖ్ ప్రాంతంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. మన దేశ సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతిచెందారు.

బస్సులో 26 మంది సైనికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లడఖ్ లోని థోయిస్ అనే ప్రాంతానికి కొద్ది దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

వాహనం 50 నుంచి 60 అడుగుల లోతులో ఉన్న నదిలోకి పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు అందరికీ గాయాలయ్యాయి. పార్తాపూర్ లోని ట్రాన్సిట్ క్యాంపు నుంచి సబ్ సెక్టార్ హనీఫ్ లోని ఫార్యర్డ్ లోకేషన్కు వెళ్తున్న వాహనం నదిలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

గాయాలపాలైన వారిని 403 ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. లేహ్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను పార్తాపూర్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలందించాలని అధికారులు వైద్యులకు సూచించారు.