రచ్చబండలో ఉదయం 10 గంటలకు నేరాలు – ఘోరాల శీర్షికన ప్రత్యేక వార్తలు ఇవ్వనున్నాము. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాద ఘటనలు, ఇతర నేర సంఘటనల సమాహారమే నేరాలు – ఘోరాలు.
పిస్తోలుతో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య
వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన జవాను కన్నెబోయిన రాములు(32) శుక్రవారం పంజాబ్‌లో పిస్తోలుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.
కన్నెబోయిన రాజయ్య, కొమురమ్మ దంపతుల కుమారుడైన రాములు పదేళ్ల క్రితం సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్)లో చేరారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో ఆయన పనిచేశారు.
రెండు నెలల క్రితం ఆయన సొంతూరుకు వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను పంజాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాములు ఆత్మహత్యకు పాల్పడినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి నుంచి సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన మృతదేహం శనివారం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి రానున్నట్లు సమాచారం. రాములు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
సిద్దిపేట ఎస్ఐ దుర్మరణం
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ పాషా శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్ నుంచి ఎస్ఐ పాషా సిద్దిపేటకు వెళ్తుండగా శామీర్ పేట మండలం మజీద్ పూర్ చౌరస్తా నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీని బైకుపై వెళ్తున్న మహ్మద్ పాషా ఢీకొనడంతో ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతకు తృటిలో తప్పిన ప్రమాదం
కాంగ్రెస్ పార్టీ నేత, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బెల్లయ్య నాయక్ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఆలేరు వద్దకు రాగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్నోవా వాహనం వెనుక భాగం నుజ్జునుజ్జయింది. మధ్యలో కూర్చున్న బెల్లయ్య నాయక్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇన్నోవా వాహనం డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.