హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ఓ భారీ భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని మరువక ముందే హైదరాబాద్ నగరంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో రెస్క్యూ టీం ఉంది.

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఐమాక్ భవనంలోని గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాద సమయంలో 20 మంది చిక్కుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రక్షణ సిబ్బంది బాధితులను కాపాడే పనిలో ఉంది.

భవనంలో చోటుచేసుకున్న మంటలు 2,3వ అంతస్థులకు తీవ్రంగా వ్యాపించి ఎగిసి పడుతున్నాయి. మంటలను మూడు ఫైరింజన్ల సాయంతో అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ ఐటీ కంపెనీ, సెక్యూరిటీ కార్యాలయాలకు మంటలు వ్యాపించాయి.

రెస్క్యూ ఆపరేషన్ ద్వారా 13 మందిని భారీ క్రేన్ల సహాయంతో కాపాడారు. వారిలో అస్వస్థతకు గురైన వారిని సత్వరమే ఆస్పత్రికి తరలించారు.

పోలీసు అధికారులు దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం 11.50 గంటలకు మొదలైన మంటలతో గంటకు పైగా సమయమైనా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఇంకా కొందరు రెండో అంతస్థులో చిక్కుకున్నట్లు సమాచారం. 

అగ్నిప్రమాదం ఎలా జరిగింది. ఎంతమేరకు నష్టం జరిగిందో తెలియాలంటే మంటలు పూర్తిగా అదుపులోకి రావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా.. లేక గ్యాస్ ద్వారా వ్యాపించాయా.. అన్నది విచారణలో తేలాల్సి ఉంది.