నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగి విషాదం నెలకొంది. ఆలయంలోని ఆరుబయట ఉన్న రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆలయ ఉత్సవాల సందర్భంగా రథానికి విద్యుత్ షాక్ తగిలి పలువురు మృతిచెందిన ఘటన చోటుచేసుకొంది. ఆ ఘటన మాదిరిగానే కేతేపల్లిలో విషాదం చోటుచేసుకొంది.

కేతేపల్లి రామాలయానికి చెందిన రథాన్ని రథశాలలో భద్రపరుస్తుండగా దానికి విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ చోటుచేసుకొంది. దీంతో రథం పట్టుకున్న రాజుబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) అక్కడికక్కడే మృతి చెందారు.

ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కేతేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.