మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రసిద్ధ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. భక్తులకు, భగవంతుడికి వారధిగా ఉండి అర్చనలు, పూజలు చేసి భగవన్నామ స్మరణలో మునిగి తేలాల్సిన అర్చకులే తన్నుకున్నారు. శివుడి సాక్షిగా ఆలయంలోనే వారు తన్నుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషయాన్ని ఆలయ అధికారులు బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. అయితే శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో అర్చకులు కొట్టుకున్న వీడియో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.
ఒకరేమో ఆలయ అర్చకుడు కాగా మరొకరు అతిథి అర్చకుడిగా కొంతకాలం నుంచి శివయ్యకు సేవలు అందిస్తున్నారు. 23వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ఆ ఇద్దరి మధ్య ఒక్కసారిగా వివాదం రాజుకుంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య పూజా కానుకల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాలు కుదరలేదు.
కానుకల పంపకాల విషయంపై వారిద్దరి మధ్య కొంతకాలంగా ఉన్న వివాదం మరింత ముదిరింది. దీంతో దేవాలయ అర్చకుడు దనుంజయ్ శర్మ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. సిబ్బంది అందరూ చూస్తూ ఉండగానే అతిథి అర్చకుడిపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది వారిస్తున్నా అతనిపై దాడికి పాల్పడ్డాడు అని సిబ్బంది తెలిపారు.
ఇంత జరిగినా ఈ విషయంపై దేవస్థాన ఈఓకు ఆలస్యంగా తెలిసిందని చెప్పారు. ఆలయ అర్చుకుడు ధనుంజయ్ శర్మకు మెమో అందించినట్లు దేవస్థాన ఈఓ గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.
ఏదేమైనా మేళ్లచెరువు శివాలయం గత కొంతకాలంగా వివాదంగా మారుతుందని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ శివయ్య మూడో కన్ను తెరవకముందే ఆలయలో జరుగుతున్న విషయాలను చక్కదిద్దాలని గ్రామస్థులు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు.