ఏడాదిన్నర కాలంగా కన్న కూతురిపై అత్యాచారం.. పంటి బిగువున భరించిన తల్లి లేని బాలిక

రచ్చబండ: కామంతో ఆ దుర్మార్గుడి కళ్లు మూసుకుపోయాయి. వావి వరుసలు మరిచేపోయాడు. ఎవరూ అడ్డు లేరనే అహం అతనిలో పెరిగింది. కనురెప్పనే కాటేశాడు. ఒకరోజు, ఒక నెల కాదు.. ఏడాదిన్నరగా తన అకృత్యాలు కొనసాగించాడు. మైనర్ అయిన కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చాడు.

సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాఘడ్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడనే ఆరోపణలతో ఇప్పుడు అతను కటకటాలు లెక్కిస్తున్నాడు.

ఆమె తల్లి చనిపోయినప్పుడు ఆ బాలిక వయసు 13 ఏళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆతర్వాత అతను కామాంధుడనే వికృతరూపం దాల్చాడు. కన్న కూతురిపైనే కన్నేశాడు. అప్పటి నుంచి తన కూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.

ఏడాదిన్నర కాలం నుంచి ఆ దుర్మార్గుడు తన కూతూరిపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఆ బాలిక ప్రతిఘటించి తన అమ్మమ్మ, మేనమామకు చెప్తానని చెప్పినా ఆ దుష్టుడు అదరలేదు, బెదరలేదు. ఆ బాలికనే చంపుతానంటూ బెదిరిస్తూ వచ్చాడు.

ఈ నెల 4న ఆ బాలికను తన మేనమామ తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లీవెళ్లగానే ఆ బాలిక తనపై తండ్రి అకృత్యాలను రోదనలతో చెప్పసాగింది. దీంతో వెన్వెంటనే ఆమె మేనమామ తన కోడలిని వెంట తీసుకెళ్లి అక్కడి పల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు ఆ బాలిక తండ్రిని అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ, పోస్కో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.