ఫేస్ బుక్ ప్రేమ గుడ్డిదని తేలింది. మోసపోయిన యువతి.. నిందితుడు జైలుపాలు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: ముక్కూ మోహం తెలియని వ్యక్తిలను నమ్మి ప్రేమలో ఎందరో యువతులు తమ నిండు జీవితాలను నష్టపోతున్నారు. ప్రేమ పేరుతో నయవంచనకు గురి చేసి మోసకారులు పుట్టుకొస్తూనే ఉంటున్నారు. భార్యా.. పిల్లలు ఉన్నా మరో యువతిని నమ్మించి నట్టేట ముంచిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటున్నాం. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్నది. ఫిబ్రవరి 3న బాధిత యువతి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ ఆడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) దుర్గేశ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతాప్ గఢ్ ప్రాంతానికి చెందిన సమాజ్ వాది పార్టీ నేత జావేద్ అహ్మద్ ఫేస్బుక్   ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. దాన్ని స్నేహంగా మలుచుకున్నాడు. సదరు యువతి ఫోన్ నంబర్ తీసుకున్న నాయకుడు ఆ యువతితో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ప్రేమను ఒలకబోసేవాడు. నువు లేక నేను లేను.. నువ్వు లేని లోకం వద్దు నువ్వంటే నాకు ముద్దు.. అని పెద్ద పెద్ద డైలాగులతో ఆ యువతిని నమ్మించే ప్రయత్నం చేశాడు.

వివాహం చేసుకుంటా… నీతోనే నా జీవితం.. అంటూ ఆ యువతిని జావేద్ అహ్మద్ తన మాయలో పడేశాడు. ఏమైందో ఏమో కానీ.. ఆ యువతి అతడిని నమ్మేసింది. పూర్తిగా ఆయన లోకంలోకి వెళ్లిపోయింది. ఈ దశలో ప్రత్యక్షంగా కలుసుకున్నారు. తప్పక పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి శారీరక సంబంధానికి పురికొల్పాడు. కాబోయే భర్తే కదా.. అని నమ్మిన ఆ యువతి అతనికి లొంగిపోయింది. ఇద్దరూ డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఈలోగా ఆ యువతి గర్భందాల్చింది.

ఆ దుండగుడిలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. ఎలాగైనా తన దోషాన్ని రూపుమాపాలనుకున్నాడో ఏమో. కానీ గర్భాన్ని తొలగించాలని పన్నాగం పన్నాడు. ఆ యువతికి ఎలాంటి మాయమాటలు చెప్పాడో కానీ జావేద్ అహ్మద్ తన భార్య సల్మా బేగం ద్వారా అబార్షన్ చేయించాడు. ఈలోగా తప్పించుకొని తిరగడం అతని వంతయింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దీంతో ఆ యువతిని బెదిరిస్తూ దూరం జరిగాడు. ఈ దశలోనే సల్మా బేగం ఆ దుండగుడి భార్యేనని తెలిసింది.

తాను తీవ్రంగా మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దుండగుడు జావేద్ అహ్మద్ తో పాటు అతని భార్యపైనా కేసు పెట్టింది. ఈ మేరకు శనివారమే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూశారా… అందుకే ఇలాంటి పరిస్థితులు చూశాకయినా.. ముక్కూ మొహం తెలియని వారికి, తియ్యని మాటలతో వలవేసే వారికి,  ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియాలో దరిచేరే వారికి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతుకోసే వారికి యువతులు దూరంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.