దొంగతనానికి వచ్చి బీరు తాగి, బిర్యానీ తిని దొరలా నిద్రపోయిండు!

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : దొంగతనం చేసి అలిసిపోయాడో.. బీరు తాగి మత్తుకున్నాడో ఏమో కానీ ఆదమరిచి నిద్రపోయాడు. చివరికి ఏమయ్యాడో తెలుసుకుందాం రండి.

తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లా కేంద్రం సమీపంలోని వెంకటేశన్ కుటుంబం నివాసముంటోంది. ఓ రోజు ఉదయం ఆ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన స్వతంత్ర్యనాథన్ (27)  ఆ ఇంటిలో దొంగతనానికి పూనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి దూరాడు.

బీరువాలోని నగదు, నగలు తీసుకున్నాడు. తన వెంట తీసుకెళ్లిన బీరు లాగించాడు. బిర్యానీ ఆరగించాడు. ఇంతలో ఏమనిపించిందో.. ఆ ఇంటి వారు ఇప్పట్లో రారనుకున్నాడో.. మత్తుకున్నాడో ఏమో.. ఆ ఇంటిలోని పరుపుపై హాయిగా కునుకు తీశాడు. ఇంకేముంది మనోడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

ఈ లోగా పనులు ముగించుకొని ఆ ఇంటి వారు రానే వచ్చారు. వెంకటేశన్ ఇంటి తాళం తీసి లోనికి వెళ్లి చూసేసరికి దిగ్భ్రాంతికి గురవడం ఆయన వంతయింది. ఇంకేముంది పోలీసులకు ఫోన్ చేయడమైంది.. వారు రావడమూ జరిగింది.. మనోడిని (స్వతంత్ర్యనాథన్) కటకటాల్లోకి తోలడమూ జరిగిపోయింది.