తారకరత్న మృతికి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, రేవంత్ ఏమన్నారంటే?

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : నందమూరి వారసుడు, సినీ నటుడు నందమూరి తారకరత్న మృతితో వారి కుటుంబ సభ్యులు, సినీరంగం, టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని ఆయన స్వగృహానికి తరలించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, అభిమానులు తారకరత్న పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. సోమవారం ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ చాంబర్ కు తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. పలువురు ప్రముఖులు తారకరత్న మృతిపై స్పందించారు. నారా చంద్రబాబు,  నందమూరి బాలకృష్ణ, లోకేశ్, రేవంత్ రెడ్డి తదితరుల స్పందనలు వారి మాటల్లోనే..

మా కుటుంబానికి విషాదం

నందమూరి తారకరత్న మరణవార్త తీవ్రమైన దిగ్ర్భాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత విలువైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.

  • నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి

========

బాల బాబాయ్ అన్న పిలుపు వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా

బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరనిలోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడనుకున్న. తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్లాడు. తారకరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి.

  • నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ నటుడు
  • =======

బావా అని పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు

బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహబంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి.

  • నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

==========

తారకరత్న మరణం చాలా బాధించింది

తారకరత్న మరణవార్త నన్ను చాలా బాధించింది. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం. చిన్న వయసులోనే సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి కగలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

  • రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు