వైఎస్ వివేకా కూతురు సునీత
మా నాన్న హత్య జరిగి రెండేళ్లు దాటింది.. అసలు ఎవరు చంపారు.. సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు.. న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి.. ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం చెప్పాలి.. అని మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ప్రశ్నలను సంధించారు. ఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు గురించి పలు అంశాలను లేవనెత్తారు. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను ఆమె అంతకు ముందు కలిసి కేసు గురించి వివరాలడిగారు.
విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక సీఎం చిన్నాన్న హత్యే జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని సునీత అన్నారు. రెండేళ్లు దాటినా విచారణ జరుగుతోంది.. నిందితులను పట్టుకోనేలేదు.. హత్య ఎవరు చేశారు.. న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి.. అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ కారణాలతోనే తన తండ్రి హత్య జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ కేసులో దోషులను పట్టుకోకపోతే ఈ కల్చర్ ఇలాగే పెరుగుతుందని అన్నారు. సాక్షులు వివిధ కారణాలతో చనిపోతున్నారు. ఇక సాక్షం చెప్పే వారు ముందుకొస్తారో రారోనని అనుమానం ఉందని అన్నారు. న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి. ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యత వహించాలని సునీత అన్నారు.