రచ్చబండ, హైదరాబాద్ : ఎన్ఎస్యూయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పై దాడి చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం మధ్యాహ్నం వెంకట్ ను రేవంత్ పరామర్శించారు.
ఈ సందర్భంగా వెంకట్ తనపై జరిగిన దాడి, గాయాల గురించి రేవంత్ కు వివరించారు. పోలీస్ స్టేషన్ లో ఉండి తీవ్ర గాయాలతో బాధపడుతున్నా తనను ఆస్పత్రికి పంపలేదని, కమిషనర్ తో మీరు మాట్లాడిన తర్వాతే తనను గాంధీకి తరలించారని వెంకట్ ఈ సందర్భంగా వివరించారు.
తనను పరిశీలించిన డాక్టర్ తన బాడీలో రక్తం గడ్డ కట్టిందని, స్కాన్ చేయించాలని, వెంటనే వైద్య చికిత్స అందించాలని చెప్పడంతోనే తనను ఆస్పత్రికి తరలించారని వెంకట్ ఈ సందర్భంగా రేవంత్ కు వివరించారు.
అయితే అంతకు ముందు రేవంత్ రెడ్డి వెంకట్ పై జరిగిన దాడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సిద్దిపేట వెళ్తున్న వెంకట్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పటికప్పుడే సిద్దిపేట కమిషనర్ తో రేవంత్ మాట్లాడారు.
రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందకు కూడా అవకాశం ఇవ్వకుండా అణిచి వేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
సిద్దిపేటలోని మైనార్టీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయి 130మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నేతను అడ్డుకోవడం టీఆర్ఎస్ పాలకుల పాశవిక చర్య అని పేర్కొన్నారు.
మానవత్వం లేకుండా వెంకట్ పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులే స్వయంగా వెంకట్ ను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. పాలకులు ఇలాగే పాశవిక చర్యలకు దిగితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.