మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మరో అడుగు పడింది. ఇప్పటికే గతంలో కొందరు జిల్లా అభిలాషులు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. కానీ లక్ష్యం నెరవేరలేదు. అన్ని అర్హతలున్న మిర్యాలగూడను ఎందుకు జిల్లాగా ఏర్పాటు చేయరంటూ జనాలు రగిలిపోతున్నారు. దీంతో పలువురు వివిధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఏకమై పోరుబాటకు సిద్ధమవడంతో మరో అడుగు పడినట్లయింది.
రచ్చబండ ప్రత్యేక ప్రతినిధి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జిల్లాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, ఒకటి నల్లగొండ, రెండోది మిర్యాలగూడ. చాలా కాలం పాటు లోక్ సభ నియోజకవర్గ కేంద్రంగా ఉండగా ఇటీవలే పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ పేరు కనుమరుగైంది. ఇదే జిల్లాలోని భువనగిరి కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైంది.
అదే విధంగా జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉండేవి. వాటిలో మిర్యాలగూడ ఒకటి. జనాభా పరంగా, ఆదాయం పరంగా కూడా దీనికి ప్రాధాన్యం ఉంది. కానీ ఈ ప్రాంతవాసుల దురదృష్టమో, పాలకుల నిర్లక్ష్యమో కానీ అన్ని అవకాశాలు ఉన్నా మిర్యాలగూడ మాత్రం జిల్లాగా ఏర్పాటు కాలేకపోయింది.
వ్యవసాయ రంగంలో పేరు ప్రఖ్యాతులు
వ్యవసాయ రంగంలో మిర్యాలగూడ పేరు ప్రఖ్యాతులు మిన్నంటాయి. నాగార్జున సాగర్ ఆయకట్టు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉండటం విశేషం. ఈ ప్రాంతంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తుంది. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ కూడా ఉంది. ఇప్పటికీ మార్కెట్ లో మిర్యాలగూడ రైస్ పేరిట అమ్మకాలు సాగుతున్నాయి.
వరి ధాన్యం మార్కెట్లలో ఉమ్మడి రాష్ట్రంలోనే మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ నాడు, నేడు ముందు వరుసలోనే ఉంది. నేడు పశువులు, జీవాల క్రయ విక్రయాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మిర్యాలగూడ సంత పేరు పొందింది. శని, మంగళవారాల్లో జరిగే సంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వాటి క్రయ, విక్రయాలకు ఇక్కడికి వస్తుంటారు.
ఆసియాలోనే మిర్యాలగూడకు ప్రత్యేకత
ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు కలిగిన పట్టణంగా నాడే మిర్యాలగూడకు పేరొచ్చింది. రాష్ట్రంలోనే అత్యధిక బయ్యం ఉత్పత్తికి కేంద్రంగా నిలివడం గమనార్హం. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా తదితర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి జరుగుతుంది.
అంతే కాకుండా కొన్ని విదేశాలకు కూడా మిర్యాలగూడ రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎగుమతి జరుగుతుందంటే ఈ ప్రాంత విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
పరిశ్రమలకు కేంద్రం
మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పలు పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ముఖ్యంగా రైస్ మిల్లులతో పాటు గ్రానైట్ పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. దీంతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయ కూలిపనులు, పరిశ్రమల్లో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతుంటారు.
రైస్ మిల్లుల్లో ఈ ప్రాంతీయులే కాకుండా ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి హమాలీ, కూలి, గుమస్తా, తదితర పనులు చేసుకుంటూ వేలాది మంది ఉపాధి పొందుతూ ఇక్కడే స్థిరపడ్డారు. వేలాది టన్నుల వరి ధాన్యం నిల్వ కోసం రాష్ట్రంలోనే ప్రధానమైన ఎఫ్సీఐ గిడ్డంగులకు మిర్యాలగూడలో ఉండటం విశేషం. ఇక్కడి వరకూ రైలు సౌకర్యం కూడా ఉంది.
మత్స్య సంపదకు ఆలవాలం
మిర్యాలగూడ ప్రాంతం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉండటంతో చెరువులు, వాగుల్లో నీటి గలగలలు ఉంటాయి. దీంతో మత్స్య సంపద పెరగడానికి దోహద పడుతుంది. ఏటా చేపల ఉత్పత్తి పెరగడంతో మత్స్యకారులకు ఎంతో ఉపాధి లభిస్తుంది.
వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి
మిర్యాలగూడ పట్టణంలో వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో పురోభివృద్ధిని సాధించింది. గతంలోనే ఆయా రంగాల్లో ఉమ్మడి జిల్లాలోనే ముందున్నది.
రైల్వే సౌకర్యం
మిర్యాలగూడ పట్టణానికి రైల్వే సౌకర్యం ఉండటం మరో విశేషం. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధాన పట్టణమైన మిర్యాలగూడను గుర్తించిన నాటి పాలకులు ఈ ప్రాంతాన్ని కలుపుతూ రైల్వే లైన్ నిర్మించారు. సికింద్రాబాద్ మినహా రాష్ట్రంలో మరేచోట లేని విధంగా జక్షన్, అత్యధిక స్థలమున్న రైల్వే స్టేషన్ గా మిర్యాలగూడకు గుర్తింపు ఉంది.
మరో విశేషమేమిటంటే జిల్లా కేంద్రమైన నల్లగొండ రైల్వేస్టేషన్ లో ఆగని కొన్ని ప్రధాన రైళ్లను మిర్యాలగూడలో నిలిపేవారంటే దీని ప్రాధాన్యం ఇట్టే తెలిసిపోతుంది.
ఉమ్మడి జిల్లాలో ప్రధాన కార్యాయాలు
నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని జిల్లా స్థాయి కార్యాలయాలు మిర్యాలగూడ పట్టణంలో ఉండేవి. ద్వితీయ శ్రేణి కార్యాలయాలను కూడా నల్లగొండ తర్వాత ఇక్కడే నిర్వహించేవారు. భూగర్భ జలవనరుల శాఖ, పరిశ్రమలు, తూనికలు –కొలతలు, లాంటి శాఖలకు, ఎన్ఎస్పీ ఆఫీసులకు జిల్లా స్థాయి, లేదా డీఈ స్థాయి అధికారులు ఇక్కడే ఉండేవారు. ఎన్ఎస్పీ ఎస్ఈ, డీఈ కార్యాలయం కూడా ఇక్కడే ఉండేది.
17 మండలాలతో జిల్లా ఏర్పడాలి
మిర్యాలగూడ జిల్లాగా ఏర్పాటైతే 17 మండలాలతో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయితే దేవరకొండ ప్రాంతవాసుల అభిప్రాయాన్ని బట్టి దానిని కూడా కలిపొచ్చని మరికొందరి అభిప్రాయం. అది కూడా కలిస్తే మండలాల సంఖ్య 20కి దాటే అవకాశం ఉంది.
నియోజకవర్గాలు
1) మిర్యాలగూడ
2) నాగార్జున సాగర్
3) హుజూర్ నగర్
మండలాల పేర్లు
1) మిర్యాలగూడ
2) వేములపల్లి
3) దామరచర్ల
4) త్రిపురారం
5) నిడమనూరు
6) అనుముల
7) పెద్దవూర
8) తిరుమలగిరి (సాగర్)
9) అడవిదేవులపల్లి
10) గుర్రంపోడు
11) నేరేడుచర్ల
12) పాలకీడు
13) గరిడేపల్లి
14) హుజూర్ నగర్
15) మఠంపల్లి
16) మేళ్లచెరువు
17) చింతలపాలెం
మా మిర్యాలగూడను జిల్లాగా ఎందుకు చేయరు?
ఈ ప్రాంతంలో ఉన్న ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్న బలంగా నాటుకుంది. అన్ని అర్హతలూ ఉన్న మిర్యాలగూడను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాల విభజన మొదటి దశలోనే చేయాలి. కానీ దీనికన్నా తక్కువ విస్తీర్ణం, తక్కువ జనాభా, తక్కువ ప్రాధాన్యం కలిగిన ఎన్నో ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం మిర్యాలగూడపై చిన్నచూపు చూసిందన్న అభిప్రాయం ఉంది.
జై మిర్యాలగూడ జైజై మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 13 మండలాలను విభజిస్తూ జీవోను జారీ చేసిన సందర్భంగా మిర్యాలగూడ జిల్లా కాంక్ష మరోసారి రగిలింది. దీనిపై పలువురు జిల్లా ఏర్పాటు కావాలనే అభిలాష కలిగిన వారు సోషల్ మీడియా ద్వారా ఒక్కటయ్యారు. తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జై మిర్యాలగూడ జైజై మిర్యాలగూడ నినాదంతో జిల్లా ఏర్పాటు లక్ష్యం కావాలన్న పట్టుదలతో ఉద్యమించాలని వారంతా ఉన్నారు.