రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : విశాఖ బీచ్ కు భర్తతో కలిసి వెళ్లిన ఓ యువతి ఉన్నట్టుండి మిస్సయింది. బీచ్ పక్కన ఉల్లాసంగా ఉన్న ఆ జంటలోని భర్త కనుమూసి తెరిచే లోగా ఆమె కనుమరుగైంది. దీంతో ఆమె భర్త అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అనూహ్యంగా నెల్లూరులో తన ప్రియుడితో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు.
విశాఖకు చెందిన ఓ యువతిని స్థానికుడైన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ యువకుడు హైదరాబాద్ నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి కుదిరాడు. దీంతో ఇద్దరూ హైదరాబాద్ లోనే కాపురం పెట్టారు.
తమ పెళ్లి రోజును పురస్కరించుకొని ఇటీవలే ఆ యువతి విశాఖ తల్లిగారింటికి వెళ్లింది. పెళ్లిరోజున ఆమె భర్త వచ్చాడు. ఉదయం సంబురం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తలు కలిసి సంతోషంగా బీచ్ లో గడిపేందుకు వెళ్లారు. అక్కడ ఆనందం పంచుకున్నారు. ఆహ్లాదంగా విహరించారు. భర్త సెల్ఫీ దిగుతూ ఉండగా ఆమె మాయమైంది.
సముద్ర కెరటాల్లో గల్లంతైందా, లేదా ఎవరైనా ఏమైనా చేశారా.. ఏమైందోనన్న ఆందోళన అతడిలో నెలకొంది. చుట్టుపక్కల వెతికినా జాడ కానరాలేదు. ఈలోగా కుటుంబ సభ్యులకు తెలపగా వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు విశాఖ నగర పాలక సంస్థ అధికారులు, పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతకసాగారు. హెలికాప్టర్ సహాయంతో గాలింపు చేపట్టారు. సముద్రంలో వెతికారు. సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేశారు. అయినా జాడ కానరాలేదు.
ఈలోగా బుధవారం అనూహ్య మలుపు తిరిగింది. విశాఖ బీచ్ లో మాయమైన ఆ యువతి నెల్లూరులో తన ప్రియుడి దరికి చేరిందని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారని, విశాఖకు తీసుకు రానున్నట్లు తెలిసింది.
ఈ కేసు విచారణ సమయంలో పోలీసులకు ఓ విషయం తేటతెల్లమైంది. ఆ యువతికి పెళ్లికి ముందే నెల్లూరుకు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లయ్యాక కూడా అతడితో ప్రేమ వ్యవహారం నడిపిందని తెలిసింది.
బీచ్ లో ఉన్న సమయంలో భర్త ఏమరుపాటుగా ఉండగా, అక్కడికి వచ్చిన నెల్లూరు యువకుడితో కలిసి ప్లాన్ ప్రకారం ఆ యువతి వెళ్లిందని తెలిసింది. అయితే యువతి మిస్సింగ్ పై ఆమె కుటుంబ సభ్యులు ఆమె భర్తపై అనుమానం పెంచుకున్నారని, అతడే తమ కూతురును మాయం చేశాడంటూ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.