కన్నకూతురుపై తండ్రి దురాగతం

కామంతో కళ్లు మూసుకుపోతే కన్ను మిన్ను కానరాదు. వావి వరుసలు మరిచేపోతారు. అలాంటి ఓ దుర్మార్గుడైన తండ్రి రాక్షసుడిగా మారాడు. కనిపెంచిన కన్న కూతురుపైనే పశువులా మారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో ఇటీవలే జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ తండ్రి తన కూతురిపై గత కొన్నాళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

తండ్రి దురాగతాన్ని తన తల్లికి, మేనమామకు ఆ నిస్సహాయురాలు చెప్పి విలపించింది. అయితే నిజం కాదనుకున్నారో.. పరువు పోతుందనుకున్నారో.. ఆధారమేమిటని కొట్టిపారేశారో.. ఏమో కానీ వారు అసలే పట్టించుకోలేదు. అయినా మళ్లీ ఆ దుర్మార్గుడి చేష్టలు చాలించడమే లేదు.

అసహాయురాలైన ఆ యువతి పంటిబిగువున బాధను భరిస్తూ వచ్చింది. ఎలాగైనా తన తండ్రికి గురణపాఠం నేర్పాలనుకుంది. తనపై తండ్రి చేస్తున్న అకృత్యాలను సీక్రెట్ కెమెరాతో వీడియో తీసింది.

తండ్రి దుర్మార్గ చర్యలున్న ఆ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో పోస్టు చేసి, తనకు న్యాయం చేయాలని వేడుకొంది. అది పోలీసుల వరకూ చేరింది. దీంతో వారు ఆ నీచుడైన తండ్రిని అరెస్టు చేశారు.

వావి వరుసలు మరిచిన ఇలాంటి క్రూరులకు ఎంతటి శిక్షలు విధించినా తక్కువేనని నెటిజన్లు, అక్కడి స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.