పరిగి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి

రచ్చబండ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలులో రిమాండులో ఉన్న ఖైదీ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది. పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తిరుమూపూర్ రమేష్ బాబు (72) ఇదే జిల్లాలోని చెనుగోముల్ పోలీస్ స్టెషన్ పరిధిలోని ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఉంచారు. అతను గతంలో అనారోగ్యంతో ఉండడంతో గతేడాది మార్చి నెలలో చికిత్స నిమిత్తం చెర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపారు.

ఈనెల 8వ తేదీన నిందితుడిని పరిగి కోర్టులో హాజరు పరిచి, తిరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు. అదేరోజు జైలులోని 103వ గదిలో నిద్రపోయాడు. తిరిగి 9న ఉదయం లాకప్ తెరవగ నిందితుడు తిరుమూపూర్ రమేష్ బాబు పలకక పోవడంతో పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. పరిగి జైల్ సూపరింటెండెంట్ సీహెచ్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.