• రూ.45.99 లక్షలు పలికిన గణపతి లడ్డు
• గతేడాది దక్కించుకున్న వారికే మళ్లీ సొంతం
రచ్చబండ, కంటోన్మెంట్ : మేడ్చల్ జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని కానాజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శనివారం నాటితో ముగిశాయి. గణేషుడు 11 రోజులపాటు విభిన్నమైన అలంకార రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చాడు.
ఈ నవరాత్రులను అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. ఆఖరి రోజు లడ్డూ వేలం పాటలో రూ.45 లక్షల 99 వేల 999 రూపాయలకు గీత ప్రియ, వెంకటరావు దంపతులు కైవసం చేసుకున్నారు.
గతేడాది కూడా లడ్డూను వారే దక్కించుకోవడం విశేషం. ఆ దేవుని కటాక్షం వల్ల ఉన్నత స్థాయిలో ఉన్నామని శ్రీవారి కృపకు తోడుగా ఈ లడ్డూను కైవసం చేసుకున్నామని వెంకటరావు దంపతులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. వేలం సొమ్ముతో అన్న ప్రసాద వితరణకు ఆలయ అభివృద్ధికి, ఆలయ స్థల సేకరణకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యధిక వేలం ధరగా గుర్తింపు పొందింది. బాలాపూర్ లడ్డూను రూ.24.60 లక్షల రికార్డు వేలానికి దక్కించుకోగా, దానిని మించి అల్వాల్ గణేషుడి లడ్డూ వేలం పలకడం విశేషం.