రచ్చబండ : నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న మరో వీఆర్ఏ బలవన్మరణం పొందాడు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు. వీఆర్ఏల సమ్మె శనివారం నాటికి 47వ రోజుకు చేరుకుంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు (37) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పేస్కేల్ అమలు చేయాలనే డిమాండ్‌తో వీఆర్‌ఏలు 47 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక నిరసన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.
పేస్కేల్ అమలు కాకపోవడంతో పాటు సమ్మె కాలానికి జీతం రాకపోవడం, మరోవైపు ఆర్థిక పరిస్థితులు బాగాలేక మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీఆర్ఏ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.