ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకుంటా

ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకుంటా
* టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి

రచ్చబండ, నెరేడుచర్ల : ఆపదలో ఉన్న నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటానని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. పక్షవాతంతో రెండు కాళ్లు, కండ్లు పోగొట్టుకుని చూపులేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న అరవిండ్ల నాగరాజు, రాములమ్మల కుటుంబాన్ని సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో పరామర్శించారు. తక్షణ అవసరాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబ పరిస్థితులను తెలుసుకొని చలించిపోయారు .

ఇద్దరు పిల్లలు కలిగిన ఈ నిరుపేద కుటుంబం వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుండగా ఏడాది క్రితం నాగరాజు పక్షవాతం బారినపడడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పేదరికంలో ఉన్న వీరికి కనీసం నివాస గృహం లేకపోవడం, పక్కనే కస్తూర్బా స్కూల్ లో పనిచేసే కూలీలకు వేసిన తాత్కాలిక గుడిసెలో జీవనం వెళ్లదీస్తున్నారు. భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సి రావడంతో భార్య కూడా కూలి పనికి వెళ్లలేని పరిస్థితిలో ఉంది. ప్రతి నెలా వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయం కొరకు ఎదురుచూడాల్సిన దీనస్థితి ఉందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఈ వివరాలను తెలుసుకున్న జన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి అర్హునుగా ఉన్న నాగరాజుకు ప్రభుత్వం అందించే వికలాంగుల పెన్షన్, ప్రభుత్వ వైద్యం అందించడానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

బాధితుడికి అవసరమైన మందులను అతి తక్కువ ధరలో ప్రతినెలా నేడుచర్ల మండల కేంద్రంలోని అరబండి లక్ష్మీనారాయణ జనరిక్ మెడికల్ షాప్ లో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి నివాస గృహం మంజూరు అయితే మొదటి అవకాశం ఈ కుటుంబానికి కల్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలకీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్, పెంచికల్ దిన్న మాజీ సర్పంచ్, న్యాయవాది సుంకరి క్రాంతి కుమార్, ధీరావత్ శివ నాయక్, జింకల భాస్కర్, జంపాల శ్రవణ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి కొండ పెద్ద ఎల్లయ్య, మాతంగి రాకేష్, గని, మామిడి సురేష్, మస్తానమ్మ, మీసాల చంటి, రాములు తదితరులు పాల్గొన్నారు.