మరో పోలీస్ అధికారిపై వేటు.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడన్న ఆరోపణ

రచ్చబండ : ఓ మహిళపై లైంగిక దాడి, దంపతుల కిడ్నాప్ ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన హైదరాబాద్ లోని ఓ సీఐ ఉదంతాన్ని మరువక ముందే నగరానికే చెందిన మరో పోలీసు అధికారి అలాంటి ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ విజయ్ హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి సీసీఎస్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండాకు చెందిన ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది.

పంచాయతీ కార్యదర్శి అయిన ఆ యువతితో 2014 నుంచి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ దశలో ఆమెతో సహజీవనం చేశాడు. గత కొన్నాళ్ల క్రితం విజయ్ మరో యవతిని వివాహమాడాడు. పెళ్లయ్యాక కొన్నాళ్లకు ఆమెకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మిస్తూ వచ్చాడు.

ఈ దశలో ఆ యువతికి పెళ్లి సంబంధాలు వస్తున్నా చెడగొడుతుండేవాడు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ యువతి నిలదీసింది. దీంతో అతడు దాటవేయసాగాడు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించింది.

ఈ మేరకు పోలీసులు ఎస్ఐ విజయ్ పై కేసు నమోదు చేశారు. అనంతరం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఎస్ఐ విజయ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.