రేవంత్ రెడ్డి ఉద్వేగభరితమైన ప్రసంగం

రచ్చబండ : టీపీసీసీ అధ్యక్షుడు ఎనముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం రాసిన డాలీ & చేదు నిజం పుస్తకాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేశానని ప్రజలను మోసం చేశారని, ఆయన తెలంగాణ ఉద్యమం ఒక నిజం లాంటి అబద్ధమని అన్నారు. ఆయన ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేశాడని ఆరోపించారు.

ఎవరైనా ఉద్యమాలు చేస్తే ఆస్తులు, ప్రాణాలు కోల్పోతారని, తెలంగాణ రైతాంగ పోరాటంలో అందరూ ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం ఆస్తులు కూడబెట్టుకుందని, అందరికీ పదవులు దక్కాయని అన్నారు.

తెలంగాణలో నిజాం రాజులు కూడా అభివృద్ధి పనులు చేపట్టారని, కానీ ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారని అన్నారు. అదే విధంగా ఆంధ్ర పాలకులు కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ ఇక్కడి ప్రజలు అణిచివేతకు ఎదురు తిరిగారని వివరించారు.

ప్రస్తుతం రైతుబంధు, కల్యాణ లక్ష్మి, పింఛన్లు ఇస్తున్నా, ప్రజలు వీటిని కోరుకోలేదని అన్నారు. వీటి కోసం ఉద్యమం జరగలేదని అన్నారు. రానురాను ఇక్కడ అణిచివేత పెరిగిపోతోందని అన్నారు.

తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తానని దరిద్రుడు సీఎం అయ్యాడని ఘాటుగా విమర్శించారు. అర శాతం ఉన్నోళ్లు అంతా క్యాబినెట్ లో ఉన్నారని అన్నారు. 16శాతం ఉన్న దళితులు ఎక్కడున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మందకృష్ణ మాదిగ 24 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నాడని, నువ్వేదో 12 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నావని కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి సంగతేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఓ పోలీస్ అధికారి ఓ మహిళను అత్యాచారం చేస్తే ఈ వ్యవస్థ పట్టుకోలేకపోతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

బాధితురాలిపై వ్యభిచారం కేసు పెట్టాలని, ఆమె భర్తపై బ్లాక్ మెయిలర్ కేసు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నన్ను ఇరికిస్తే, పబ్ కేసులో నిన్ను ఇరికిస్తానంటూ ఆ పోలీస్ అధికారి పెద్దలను బెదిరిస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ గాయకురాలు విమలక్కపై కేసులు పెట్టే ధైర్యం చేయలేదని, తెలంగాణ రాగానే ఆమెపై కేసు పెట్టారని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఆమెకు రాష్ట్ర ప్రజలు విధేయత చూపాలని హితవు పలికారు. దానికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

పోడు భూముల విషయంలో న్యాయం ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు అడవి బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు. పట్టాలిస్తామన్న ప్రభుత్వమే ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు.