కువైట్ నుంచి తెలుగు మహిళ ఆర్తనాదాలు

రచ్చబండ : ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లిన ఎందరో మహిళలు అక్కడ నయవంచనకు గురై మాన, ధన, ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ బతుకు భారమై, ఏజంట్ల ప్రలోభాలకు లోబడి తమ కుటుంబ క్షేమం కోసం వెళ్తుంటారు. తీరా వెళ్లాక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి దళారుల కోవలో మరో తెలుగు యువతి చిక్కుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా ఎర్రివారిపాలెం మండలం పెద్దవడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓమహిళ ఉపాధి కోసం గత నెలలో కువైట్ దేశానికి వెళ్లింది. మొదట కువైట్ లో ఉద్యోగం చేస్తే తక్కవ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఏజంటు చెంగల్ రాజు నమ్మబలికాడు. ఎలాంటి సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని ఆ యువతి కుటుంబ సభ్యులను నమ్మించాడు.

తీరా వెళ్లాక కువైట్ లో ఒక నెలపాటు ఓ చోట చేరిన ఉద్యోగంలో బాగానే ఉంది. ఇక ఆ తర్వాత తనకు కష్టాలు మొదలయ్యాయని ఆ మహిళ సెల్ఫీ వీడియోలో తన వ్యథను చెప్పి దు:ఖసాగరంలో మునిగిపోయింది.

ఉన్నచోట తనకు నచ్చలేదని, మరో చోట పని ఇప్పించాలని ఏజంటను కోరా. అందుకు సరేనన్నాడు. మరోచోట పని దొరికే లోపు తన ఆఫీసులో ఉండమన్నాడు. అంతే నన్ను ఓగదిలో బంధించి వేధించడం మొదలు పెట్టాడు. మానసికంగానే కాదు.. లైంగికంగా, శారీరకంగా వేధించసాగాడు. వేళకు ఆహారం కూడా పెట్టడం లేదు.. అని బాధితురాలు ఆ వీడియోలో పేర్కొన్నది.

ఏజంటు ఒక్కడే కాదు.. ఆయన పార్టనర్ కూడా నన్ను వేధించసాగాడు. నాలుగు రోజుల నుంచి అన్నమే తినలేదు. నీళ్లతోనే కడుపు నింపుకున్న. నన్ను ఎలాగైనా భారత్ రప్పించండి.. అంటూ ఆ నిస్సహాయురాలు భోరున విలపించి, అధికారులను వేడుకొంది.

తమ కోడలికి మంచి ఉద్యోగం ఇప్పించి, మంచిగానే చూసుకుంటానంటేనే తాము పంపామని ఇక్కడున్న ఆ మహిళ అత్త చెప్పింది. తీరా అక్కడికి వెళ్లాక ఏజంట్ మోసం చేశాడని ఆరోపించింది. ఎలాగైనా తన కోడలిని ఇక్కడికి రప్పించాలని ఆమె అధికారులను కోరింది.