అతివ అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని ఎందరో నిరూపించారు. కష్టాలు, కడగండ్లను దాటుకుంటూ ఎందరో మహిళలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించారు. పరాభవాలు, పరనిందలను చెరిపేస్తూ మరెందరో తమ ఉజ్వల భవితను సృష్టించుకున్నారు. మరి అలాంటి ఓ అబల అత్తింటి వేధింపుల కారణంగా పట్టుదల పెంచుకొని అత్యున్నత స్థాయికి చేరింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివంగి గోయల్ ఉన్నత విద్యాభ్యాసం చేసింది. పెళ్లికాక ముందే ఆమె ఒక లక్ష్యాన్ని పెట్టుకొంది. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాసింది. ఫలితం రాలేదు. ఈ లోగా పెళ్లి కావడంతో సంసారంలో మునిగిపోయింది. ఆమెకు ఒక కూతురు కలిగింది.
కొంతకాలానికే అదనపు కట్నం కోసం శివంగి గోయల్ కు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్తతో పాటు అత్తమామలు వేధించసాగారు. శివంగి గోయల్ అత్తింటి వేధింపులు తాళలేక పోయింది. తన కూతురును వెంటేసుకొని పుట్టింటికి వెళ్లింది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.
అత్తారింటి వేధింపులతో నిట్టూరుస్తూ ఉన్న సమయంలో ఓ మెరుపు ఆలోచన వచ్చింది. తాను నిలదొక్కుకోవాలని నిశ్చయించుకుంది. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకుంది. ఈలోగా సివిల్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇంకేముంది తనకు తాను మరోసారి పరీక్షించుకోవాలనుకుంది.
అత్తారింటి వేధింపులను పట్టుదలగా మలుచుకొంది శివంగి గోయల్. ఓ వైపు విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా, మరోవైపు ఎలాంటి కోచింగ్ లేకుండానే పుట్టింటి వద్ద పుస్తకాల పురుగైపోయింది. ఎలాగైనా సివిల్స్ సాధించాలనేదే ఆశయంగా చదవసాగింది.
తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో శివంగి గోయల్ కల ఫలించి 177వ ర్యాంకు సాధించింది. తన భవితకు బాటలు వేసుకొంది. ఇంకేముందు ఐఏఎస్ అయ్యే రోజొచ్చింది. అత్తింటి వారే చిన్నబుచ్చుకునేలా ఆమె పైచేయి సాధించి అబల కాదు సబల అని నిరూపించుకుంది.
శభాష్ శివంగి గోయల్.. నీ సక్సెస్ నిరుపమానం. నీ విజయం మరెందరో అసహాయులకు ఆదర్శం. మరొకరు కుంగిపోకుండా నీలా పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని నిరూపించావు. అందుకే మరోసారి శభాష్ శివంగి గోయల్..