తెలంగాణ పొలికేక ‘భీమిరెడ్డి’

నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా.. కమ్యూనిస్టుల పుట్టినిల్లు కర్విరాల కొత్తగూడెం..
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆ ఊరిలో జన్మించిన ఓ బాలుడు మట్టి మనుషుల కొరకు ఉదయించిన సూర్యడిగా వెలుగై నలుదిక్కులా ప్రకాశించాడు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ వెట్టి బానిసలై బతుకుతున్న నోరుండి బతకలేని బడుగు జీవులకు భరోసా అయితడని.. దొరల, భూస్వాముల ఆగడాలను ఎదిరించే ఆయుధమై పోరు జెండా పొలికేకగా మారుతడని.. ఎవరూ అనుకోలే.. దొరల, భూస్వాముల ఆగడాలను చూసి ఉగ్ర రూపం డాల్చి, ప్రళయ రుద్రుడై అగ్ని గుండం లోకి ఆయుధం పట్టుకొని దూకాడు. శత్రువు గుండెల్లో సింహ స్వప్నమయ్యాడు. ఆయన ఎవరో కాదు.. పులి బిడ్డ భీమిరెడ్డి నర్సింహారెడ్డి. ఆయనను సహచరులు బీఎన్ అని పిలుచుకుంటారు.

చిరుప్రాయంలోనే నాయకత్వ లక్షణాలు

తుంగతుర్తి ప్రాంతం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంభంలో పుట్టిన ఐదుగురి సంతానంలో ఆయన పెద్ద కొడుకు. సాయుధ పోరాటంలో తనతో పాటు ఉద్యమంలోకి ఆయుధం పట్టుకొని అన్న అడుగు జాడల్లో నడిచిన వీర వనిత స్వరాజ్యం స్వయానా ఆయన సోదరి. 15 సవంత్సరాల వయస్సు లో గోరెంట్ల దొరకు వ్యతిరేకంగా తన తండ్రి రైతుల పక్షాన నిలబడి కలబర్చిన తీరు బీఎన్ ను ఎంతో ఉతేజ పరిచింది. చుట్టుపక్కల గ్రామాలపైనా ఆ ప్రభావం పడింది. ఇంటికి వచ్చే పేద రైతులను ఆదరించే తల్లి తాపత్రయం చూసి ఆయనలో అన్యాయం మీద తిరుగుబాటు చేయాలనే బీజం పడింది. నల్లగొండ లో చదువుతున్న సందర్భంగా వందే మాతరం నినాదం రగిలింది. అలా చిన్న తనంలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు చిగురించాయి.

పాలేరు బువ్వ తినలేదని..

పెద్ద రైతుల ఇంటి లో పుట్టినప్పటికీ కష్ట జీవుల బాధలు, గాథలు, బరువులు, ఆకలి మంటలు కళ్లారా చూసి చలించాడు. ఆయన ఇంట్లో మూగ పాలేరు ఉండే వాడు. చాలా బలవంతుడు. నాగలి దున్నడం, గడ్డి వాము వేయడం, బరువులు మోయడం, నారు మోయడం, బీఎన్ తో సమానంగా చేసేవాడు. ఎందుకో ఒక రోజు నీరసంగా కనిపించాడు. రెండు రోజుల నుంచి బువ్వ తినలేదని తెలసి బీఎన్ చలించాడు. అప్పుడు కష్టం చేసే వాళ్లకు తిండి ఎందుకు లేదు. ఎంత కాలం కష్టం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ పిల్లల సంగతి ఏమిటి అనే ప్రశ్నలు పేద ప్రజల పక్షాన నిలబడటానికి ప్రధాన భూమిక అయ్యింది.

గోరెంట్ల గ్రామం నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన కమ్యూనిస్టు సాహిత్యం, లెనిన్ రాసిన పల్లెటూరి పేదలకు లేఖ, మాక్సిం గోర్కీ రాసిన అమ్మ నవల, 1942 లో రాజారెడ్డి, తన సోదరి శశిరేఖ, ప్రియం వధతో కలిసి 9వ ఆంధ్ర మహాసభకు హాజరైన అనుభవం ఆయనను ప్రభావితం చేశాయి. మొదటి సారి కామ్రేడ్ పదం విన్నాడు. నిజాం వ్యతిరేక శక్తులందరినీ ఆ సమావేశం పరిచయం చేసింది. అరుట్ల దంపతులతో అప్పుడే పరిచయం కుదిరింది. వెట్టిచాకిరీతో వృత్తి కులాలను భూస్వాములు కట్టుబానిసలు గా చేసింది. సొంత ఆస్తి లేక పోవడం, పొద్దున లేచిన దగ్గర నుంచి నడి రేతిరి దాకా భూస్వాముల ఇండ్లలో పని చేయాలి. కూలీ లేదు తిండి లేదు. అడిగేది లేదు. అడిగితే బతికి బట్ట కట్టేదిలేదు. తాళ్లు ఉచితంగా గీయడం, బట్టలు ఉచితం గా ఉతకడం, ఉచితం గా బట్టలు నెయ్యడం,  ఉచితం గా వ్యవసాయం చేయడం, ఆడవాళ్లు ఇండ్లలో పని చేయడం. సొంత పనులు అంటూ ఉండేవి కావు. ఇదే వెట్టి చాకిరీ. ఇదంతా కూడా భీమిరెడ్డి పేద ప్రజల పక్షాన నిలవడానికి కారణమయ్యాయి.

నిజాం ఏలుబడిలో తెలంగాణ

దేశం మొత్తం స్వాతంత్య్రం పొందిన సంబరాల్లో ఉంటే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా నిజాం ఏలుబడిలోనే ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దయా దాక్షిణ్యాలతో పరిమిత అధికారాలతో మనుగడ సాగించిన నైజాం చక్రవర్తి.. చివరికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు తెలనొప్పిగా మారిండు.. బ్రిటిష్ కు తొత్తుగా మారిండు.. నిజాం రాష్ట్రంలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు దేశ పాండేలు ఉండే. వీరి ఆధీనంలో 10 వేల గ్రామాలు ఉండేవి. మొత్తం 5కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 1 కోటి 50 లక్షలు ఎకరాల భూమి జమీందారుల కింద ఉంది. అన్ని గ్రామాలపై సర్వ హక్కులు వీరికే ఉండే. ప్రజలపై పన్నులు వేయడం, అన్ని వర్గాల ప్రజలతో వెట్టి చేయించుకోవడం, దౌర్జన్యం చేయడం.. ఎదురుతిరిగితే శిక్షలు వేయడం. పొద్దునదాకా పని చేయించుకోవడం.. ఒక రకంగా ప్రజలకు ఏ హక్కులూ ఉండేడివి కావు.. వీటి ప్రభావం బీన్ మీద పడింది.. తెలంగాణ లో అమలు చేస్తున్న లెవీ గళ్ళ విధానం పై పోరాటమే తొలి పోరాటమైంది.

మొండ్రాయి ఘటన

లంబాడీల పంట పొలాలను కాజేయలని కడారి రమాచంద్రరావు అనే దేశ్ ముఖ్ నిజాం మిలట్రీ ని గిరిజన గూడెం మీదకు పంపించాడు. అది తెలిసి బీఎన్ దేవులపల్లి, యాదగిరి రావు వెళ్లి లాంబాడీలకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చారు.

పాలకుర్తి పోరాటం

పాలకుర్తిలో ఒక సాధారణ మహిళ, తనకున్న రెండు ఎకరాల భూమిలో భర్త, కొడుకుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ, వృత్తిని నమ్ముకొని జీవిస్తుంది. విసునూరు రామచంద్రారెడ్డి అనే దేశ్ ముఖ్ ఆగడాలను ఎదిరించి తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చింది. దొరల ఆగడాలు ఎదిరించి గ్రామం నడిబొడ్డున ఆంధ్ర మహాసభ ఆధర్యంలో ఆరుట్ల రామచంద్రరెడ్డి రాకతో పెద్ద సభ, వేలాది మంది జనం చుట్టూరా గ్రామాల పెద్ద ఎత్తున వచ్చారు. దీనిని సహించలేని విసునూరు గుండాలు అరుట్లపై హత్యా ప్రయత్నం చేశారు. ఐలమ్మ భర్త, కొడుకు గుండాలపై ఒకే పెట్టున దూకి అడ్డుకున్నారు. కానీ జరగాల్సిన సభ ఆగిపోయింది. ఐలమ్మ ధైర్యం, తెగింపు, పోరాడే తత్వం, గుండాలకు కంటకింపుగా మారింది ఎలాగైనా పొలం కాజేయలని కుట్ర, బెదిరింపులు, దౌర్జన్యం, ఒకటేమిటి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసారు. కామ్రేడ్ బీఎన్ దళం పాలకుర్తి చేరి పొలం కోసి ఇంట్లో ధాన్యం పోసి అడ్డొచ్చిన విసునూర్ గుండాలను తరిమి కొట్టారు. ఈ పరిస్థితి దొరకు నిద్రపట్టలే, చుట్టూరా ఉన్న చిన్న చితక దొరలు, గుండాలను ఊరు చుట్టూ పెట్టుకున్నాడు. బీన్ దళం, కొంతమంది వలంటీర్స్ అన్నీ ప్రాంతాల నుండి వచ్చిన ఎర్ర సైన్యం పెద్ద ఎత్తున దొర గడీ ముందు పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఎర్రజెండా జిందాబాద్, వెట్టి చాకిరీ పోవాలి, దున్నేవానికే భూమి వంటి నినాదాలతో సాగుతున్న ఊరేగింపుపై గుండాలు దొంగ చాటుగా గురిపెట్టి కాల్చారు. యువ నాయకుడు కొమురయ్య గుండెకు తూటా దిగి నెలకొరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణం తో కామ్రేడ్ బీన్ ఉద్రుక్తుడై సింహంలా నలువైపులా గర్జించాడు. పారిపోతున్న విసునూరు దొరల కచడాల వెంట బడి దొరికినోన్ని దొరికినట్లే గురిపెట్టి చావగొట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ  అన్యాయం జరిగినా దొరగాల ఆగడాలు జరిగిన బీన్ సెంట్రల్ దళం దిగాల్సిందే. బీన్ ఎన్నో చిత్ర హింసలుకు గురైనాడు. జైలు జీవితం గడిపాడు. ప్రాణాపాయ స్థితి నుంచి క్షణాల్లో తప్పించున్నారు. పాత సూర్యాపేట, కోటపహాడ్, అనేక పోరాట ఘట్టాల్లో స్వయంగా న్యాయకత్వం వహించాడు. ఆయన చెల్లెలు స్వరాజ్యం కూడా చేరి ఆసాంతం అన్న బాటలో నడిచింది.

ప్రజా ఉద్యమాలకు దిక్కు

దేవులపల్లిని తన గురువుగా ప్రకటించాడు. ఆయన పోరాటం అనంతరం మూడుసార్లు ఎంపీగా, రెండు దఫాలుగా ఎమ్మెల్యే గా గెలిచాడు…ఎడారిగా మారిన తుంగతుర్తి, సూర్యపేట, జనగామ ప్రాంతాలకు పోచంపాడు రెండవ దశ కాలువనీళ్ల కొరకు ఎన్నో పోరాటాలు చేశారు. చట్ట సభల్లో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు తను ఎంపీగా ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో తిర్మలగిరి వద్ద ప్రగతినగర్ లో శంకుస్థాపన చేయించిన ఫలితంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా జలయజ్ఞం పేరుతో శ్రీరామ్ సాగర్ రెండవ దశ కు కాలువలు తీయించటం లో బీన్ త్యాగం ఎంతో ఉంది. నేను బ్రతికి ఉండగానే కాలువనీళ్లు చూడాలని, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం పచ్చని పంట పొలాలు గా ఎదగాలన్న ఆయన కల నేడు నిజమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో గోదారి నీళ్లు వచ్చాయి. ప్రతి బీడు భూమి మాగాణి అయ్యింది. రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము అంటే భీమిరెడ్డి ప్రజలను సమీకరించి ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేసిన కారణం గానే ఈరోజు మనం చూస్తున్న కాలువలు. భీమిరెడ్డి తన కోసం కాకుండా ప్రజల కోసం బ్రతికినోడు. చివరిదాకా కూడా అతి సామాన్య జీవితం గడిపాడు. ఆస్తి అంతస్తుల కొరకు కాకుండా తనకున్న ఆస్తిని కూడా ప్రజా ఉద్యమాలకు దారబోసిన వ్యక్తి.. నీతి నిజాయితీ కి నిలువెత్తు విగ్రహం బీఎన్. సమాజం లో అందరికి సమానమైన అవకాశాలు రావాలని అది కమ్యూనిజం వల్లనే సాధ్యం అవుతుందని చివరిదాకా ఆదర్శగా కమ్యూనిస్టుగానే బ్రతికిండు. సామాజిక ఉద్యమానికి సూర్యపేట కేంద్రంగా జరిగిన ఉద్యమానికి పురుడు పోసిండు. అలాంటి త్యాగాల చరిత్ర కలిగిన వీరుడు బీమిరెడ్డి నర్సింహారెడ్డి 2008 మే 9న కన్నుమూశారు. ఆయన మరణం సామాజిక ప్రజా ఉద్యమాల కు తీరని లోటు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా శ్రీరామ్ సాగర్ కాలువ కు భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారి పెట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నం గా నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుదాం.

నేడు బీమిరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతి సందర్భంగా..

– నెమ్మాది వెంకటేశ్వర్లు,

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు,

సూర్యపేట-9848729533