ఈటల ప్లాన్ ఇదేనా?

రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రణాళిక సిద్ధమైందా.. అనుయాయులు, సహచర నేతలు నియోజకవర్గ ప్రజలతో జరిపిన మంతనాలు ఆఖరి దశకు చేరాయా.. ఎన్ఆర్ఐల సలహాలు ఇవేనా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని శ్రేయోభిలాషులైన ముఖ్య నేతల సూచనలు అవేనా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈటల హుజూరాబాద్ లో సోమ, మంగళవారాల్లో రెండు రోజులుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు. అయితే పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వచ్చి రాజేందర్ను కలిసి వెళ్తున్నారు.

మద్దతుగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. వీరితో పాటు వివిధ కుల సంఘాల నుంచి విశేష మద్దతు వస్తున్నది. వివిధ జిల్లాల నుంచి అభిమానాలు తరలివస్తున్నారు. మంగళవారం వారందరితో ఈటల బిజీగా గడిపారు. అదే విధంగా ఆయన జూమ్ మీటింగ్ ను నిర్వహించి ఎన్ఆర్ఐలతో చర్చించి వారి సలహాలూ తీసుకున్నారు. వారంతా ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీ పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు చెప్తున్నారు. దీంతో వారి నిర్ణయం మేరకే ఈటల రాజేందర్ నడుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ మేరకు మొదట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీ పదవికి రాజీనామా చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అనంతరం ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని యోచన. అనంతరమే నూతన పార్టీ ఏర్పాటు విషయమై నిర్ణయించుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సమయంలో విశేష మద్దతు కూడగట్టుకునేందుకు గడువు దొరుకుతుందని ఈటల అనుయాయులు చెప్తున్నారు.