ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఓ దశలో ఆమె రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడినట్లుగా ఉంది. ఈటల ఎపిసోడ్ తో అయోమయ స్థితిలోకి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరుస కార్యక్రమాలతో జోరు పెంచిన షర్మిల పార్టీలో దీక్ష అనంతరం జోష్ తగ్గింది.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చనే ధీమాతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలాగా పథకాలను అమలు చేసి రాజన్న రాజ్యం తెస్తానని మొదట్లోనే ఆమె ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం అందని ద్రాక్షలా చేశారని పాలకులపై ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఆమె భరోసా కల్పించారు.
అన్ని జిల్లాలకు చెందిన అభిమానులతో విడివిడిగా సమావేశాలు జరిపారు. అనంతరమే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిరుద్యోగుల కోసం ఏప్రిల్ 15న దీక్ష నిర్వహించారు. పోలీసుల వైఖరికి నిరసనగా తన ఇంటి వద్ద కొన్నాళ్లు దీక్ష చేసి విరమించారు. త్వరలో పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం లేదు. దీంతో ఆమె వెంట నడిచిన కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొంది.
షర్మిల అనుకున్నట్లుగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చనే ఆశలు ఆదిలోనే నీరుగారినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా ఆమె సమన్వయ సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ద్వితీయ స్థాయి కంటే తక్కువ స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యమైన రాష్ట్రస్థాయి నేతలెవరూ ఆమె వెంట నడవలేదు. దీంతో పాటు ఆమె సామాజిక వర్గానికి చెందిన వారే అధిక శాతం ఉండటం గమనార్హం. అందునా వారిదే పెత్తనంగా కనిపించింది.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుల కుటుంబాలకు చెందిన కొందరు అక్కడక్కడా హాజరైనా తర్వాత కనుమరుగయ్యారు. దీంతో పాటు ప్రధానంగా తెలంగాణకు వ్యతిరేక శక్తిగా షర్మిలను పలు వర్గాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈదశలోఆమె తన రాజకీయ ప్రాబల్యంపై దిగులు చెందారు. ప్రముఖులెవరూ లేకుంటే పార్టీనెలా విస్తరించాలంటూ మదన పడుతున్నట్లు భావిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ కు గురైన తర్వాత రాజకీయ పరిణామాల్లో క్రమంగా మార్పు చోటుచేసుకుంటోంది. రాజకీయ పునరేకీకరణ కోసం రాజకీయ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తుండటం, నూతన పార్టీ ఆవిర్భావానికి దారితీసే పరిస్థితులు ఏర్పడటంతో తమ పార్టీకి ప్రాధాన్యత ఉంటుందా అనే మీమాంసలో షర్మిల పడ్డట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పక్షాలుగా ఉండగా, ఈటల నాయకత్వంలో మరో పార్టీ పురుడు పోసుకుంటే తాను ఏర్పాటు చేయబోయే పార్టీని ప్రజలు ఆదరిస్తారా అన్న అనుమానాలు ఆమెలో నాటుకున్నట్లు చెప్తున్నారు. ఇక చేసేదిలేక ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మిన్నకుండిపోయారు. పార్టీ ఏర్పాటు ప్రకటనపై కూడా ఎలాంటి వైఖరి వెల్లడికాక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.