భూకబ్జా ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఆచీతూచీ అడుగులేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఒకవైపు సాగింది. అటు బీజేపీలో లేదు కాంగ్రెస్ లో చేరతారని, లేదు సొంత పార్టీ పెడతారంటూ మరో ప్రచారం హోరెత్తుతోంది. ఓ దశలో ఈటల, సీఎం కేసీఆర్ రాజీ అవుతారన్న ప్రచారం కూడా సాగింది.
రాజేందర్ తన సొంత నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్ వెళ్లొచ్చాక కాస్త వూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా ఈటల తన బలాబలాలను అంచనా వేసే పనిలో ఉన్నాడని, ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాజేందర్ తనకు తెలిసిన వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలతో సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ వారి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్తున్నారు.
అయితే ఈ దశలో ఆయనకు ఎవరు మద్దతుగా నిలుస్తున్నారు.. ఏఏ వర్గాలు తోడుగా ఉంటాయి.. అన్నది చర్చనీయాంశంగా మారింది. సొంత నియోజకవర్గం పరిధిలోని ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు మాత్రం ఈటలకు తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. సామాన్య కార్యకర్తలు సైతం తమ నేతకు జరిగిన అన్యాయంపై భగ్గుమంటున్నారు. వెల్లువలా కదిలివచ్చిన నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచే ఎన్ఆర్ఐలతో మాట్లాడి వారి నుంచి కూడా మద్దతు కూడగట్టారు.
ఈటల రాజేందర్ కు బీసీ, దళిత, గిరిజన సంఘాల నుంచి కూడా విశేష మద్దతు లభిస్తోంది. పార్టీ పెడితే అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. కరోనా సమయంలోనూ శామీర్పేటలోని ఈటల నివాసానికి ఆయా వర్గాల నేతలు కదిలి వస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యమకారుడిగా ఆయనకు ఉన్న పరిచయస్తులు, నేతలు, అభిమానులు కూడా తరలివస్తున్నారు.
ఇదే దశలో ఈటల రాజేందర్ ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కలవడం చర్చనీయాంశమైంది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా కొండాతో కలిసి ఈటల పార్టీ పెడతారంటూ జరిగిన ప్రచారానికి వారి కలయిక బలం చేకూర్చినట్లయింది. మరి వారి కలయిక దేనికి దారి తీస్తుందో వేచి చూద్దాం.
తెలంగాణ ఉద్యమకారుడు, మంత్రి హరీష్ రావు సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలను కలవడం చర్చకు దారితీసింది. పార్టీ పెడితే ఈటల వెంట రవీందర్ రెడ్డి వెళ్తారని జోరుగా చర్చ సాగుతోంది. మరో వైపు ఆయన హరీష్ రావు సన్నిహితుడు కావడం లోతైన చర్చకు దారితీసింది.
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా ఈటలను కలవడం ఉత్కంఠకు తెరతీసింది. ఇలా చిన్నా, చితక నేతలు ఎందరో ఈటలకు సానుభూతి తెలుపుతూ కలిసి వెళ్తున్నారు. ఇలా ఒకరొకరు ఈటల వద్ద రాజకీయ ప్రస్తావన లేవనెత్తి భరోసా ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. స్వపఓం నుంచి ప్రముఖులు ఎవరూ ఈటలకు మద్దతు ఇవ్వకున్నా మునుముందు పరిస్తితి ఎటు దారితీస్తుందో వేచి చూద్దాం మరి.