టీఆర్ఎస్-కాంగ్రెస్.. మధ్యలో పీకే..!

ప్రశాంత్ కిషోర్.. ఇప్పడు దేశంలో కంటే తెలంగాణలో ఆ పేరు హాట్ టాపిక్. పీకేగా అందరూ పిలుచుకునే ఆయన దేశంలోనే ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త. మునుపెన్నడూ లేని విధంగా ఆయన వివిధ రాష్ట్రాల్లో తన వ్యూహాలతో ప్రభుత్వాలనే అధికారంలోకి తెచ్చిన పేరుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉండటంతో రాజకీయ చర్చకు మళ్లీ తెరలేసింది. ఈ వారం రచ్చబండ ఎడిటోరియల్ లో పూర్తి సారంశం మీకోసం..

ఇప్పటికీ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలతో గెలిచిన పార్టీలే అధికారంలో కొనసాగుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆయన అక్కరొచ్చింది.

ఆ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పీకేతో చర్చలు కూడా జరిపారు. ఒప్పందం కూడా జరిగింది. ఆ మేరకు పీకే రాష్ట్రంలో రెండు దఫాలు సర్వేలు జరిపినట్లు తెలిసింది. వచ్చిన ఫలితాలను సీఎం కేసీఆర్ కూ పీకే సమర్పించినట్లు తెలిసింది.

మళ్లీ అధికారంలోకి రావాలంటే సీఎం కేసీఆర్ కు కొన్ని సూచనలు కూడా ఇచ్చారని సమాచారం. దాంతో పీకే సలహాలకు అనుగుణంగా కేసీఆర్ అధికారిక, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేసీఆర్ మునుపెన్నడూ లేనంతగా కొన్నికీలక మార్పలకు శ్రీకారం చుట్టడం అందరూ చూస్తూనే ఉన్నారు.

సీన్ కట్ చేస్తే ఢిల్లీ వెళ్లాక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు సోనియా, రాహుల్, ఇతర ముఖ్యులతో చర్చలు కూడా జరిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరితే పీకేకు కీలక పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలు, అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వివిధ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై కీలక చర్చలు జరిగాయని తెలిసింది.

కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు పీకే ఎన్నికల పొత్తు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చారని తెలిసింది. ముఖ్యంగా ఏపీలో వైఎస్సార్ సీపీతో కలవాలని, తెలంగాణలో సొంత బలంతో వచ్చే అవకాశముందని తేల్చి చెప్పారని ప్రచారమూ జరిగింది.

గతంలో పీకే, కేసీఆర్ చర్చల్లో మరో కోణం బయటపడ్డట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంత బలహీనపడ్డ మాట వాస్తవమేనని, బీజేపీ ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ ను మచ్చిక చేసుకుంటేనే బాగని పీకే సీఎం కేసీఆర్ కు సూచన ప్రాయంగా చెప్పినట్లు భావిస్తున్నారు. దానికి కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు అనుకుంటున్నారు.

ఆ తర్వాత రాష్ట్రంలో అంతగా పాదుకోని బీజేపీతో వైరం పెట్టుకున్న సీఎం కేసీఆర్.. బలం పెంచుకుంటున్న కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనడం లేదు. గతంలో కాంగ్రెస్ నేతలపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్.. నేడు కాంగ్రెస్ నేతల పేరే ఎత్తడం లేదు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని కేసీఆర్ మెచ్చుకోవడం సానుకూల అంశాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని కేసీఆర్ బీజేపీతోనే ప్రధానంగా తలపడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల అంశమే అందుకు కారణం.

అనంతరం కాంగ్రెస్ పెద్దలతో పీకే జరిపిన చర్చల్లోనూ తెలంగాణ అంశం చర్చకొచ్చినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. దీర్ఘ రాజకీయ స్వలాభం కోసం టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటే లాభం ఉంటుందని పీకే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు అనుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసినా అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ కు అనుకూలంగా, లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అధికంగా గెలిచేలా వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటే మంచిదని కూడా సూచించినట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం పీకేకు ఓ సలహా ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ తో కేసీఆర్ వైఖరేమిటో తెలుసుకోవాలని సూచించిందని సమాచారం. అదే విధంగా తమ పార్టీకి చెందిన ముఖ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు పీకేకు చెప్పి హైదరాబాద్ కు రాయబారం పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ శనివారం హైదరాబాద్ నగరానికి వచ్చి సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో కూడా విడిగా చర్చిస్తారనే ప్రచారమూ ఉంది. దీంతో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రాష్ట్ర నేతల వైఖరులను తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో పీకే వ్యూహాన్ని రచించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాష్ట్రంలో పొత్తు విషయమై చర్చించే రాయబారం నడుస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీల నడుమ పొత్తు ఫలిస్తే రాష్ట్రంలో ద్విముఖ పోటీయే ఉంటుంది. లేకుంటే త్రిముఖ పోటీ తప్పదు. మరి తెలంగాణ రాజకీయ రణరంగంలో మున్ముందు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి మరి.

– బొమ్మకంటి బిక్షమయ్య గౌడ్,
సీనియర్ జర్నలిస్టు