పోలీస్ జులుం

• పోలీసుల వేధింపులకు మరొకరి బలి
• గణపురంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
• చికిత్స పొందుతూ 11రోజుల అనంతరం మృతి

ఘణపురం : రామాయంపేట, ఖమ్మం ఘటనలు మరువక ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పోలీసుల వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన చోటుచేసుకొంది.

నిప్పాని శ్రావణ్ గణపురంలోని బైక్ షోరూం యజమాని మోతుకురి శ్రీనివాస్ వద్ద ఫైనాన్స్ లో బైక్ తీసుకున్నాడు. ఫైనాన్స్ మొత్తం చెల్లించి ఎన్వోసీ అడిగాడు. ఫెనాల్టీ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు.

ఈ క్రమంలో బైక్ షోరూం యజమాని శ్రీనివాస్, శ్రావణ్ ను కొట్టగా.. తన మామను ఎందుకు కొట్టావంటూ గణపురం మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ ప్రశ్నించాడు. దీంతో వెంటనే బైక్ షోరూం యజమాని గణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో ప్రశాంత్, శ్రావణ్ ను ఈనెల 11న పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్ వారిద్దరినీ తీవ్రంగా కొట్టి విడిచిపెట్టాడు. మరుసటి రోజు మళ్లీ పోలీస్ స్టేషన్ కు రమ్మని పోలీసులు వచ్చి చెప్పడంతో మళ్లీ కొడతారనే భయంతో ప్రశాంత్ పురుగుల మందు తగాడు.

దీంతో ప్రశాంత్ ను ముందుగా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హన్మకొండకు పంపారు. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రశాంత్ కన్నుమూశాడు.

ఎస్పీకి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు
తన కుమారుడి ఆత్మహత్యాయత్నానికి గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, హోండా షోరూం యజమాని మోతుకురి శ్రీనివాస్ కారకులని మృతుడు ప్రశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ మేరకు వారిద్దరిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ సురేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశామని ప్రశాంత్ తండ్రి చెప్పారు. తన కొడుకు ఆత్మహత్యకు యత్నించడానికి వారిద్దరి వేధింపులే కారణమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆదివారం ప్రశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఎస్ఐపై వేటు.. షోరూం యజమానిపై కేసు
ప్రశాంత్ ఆత్మహత్య ఘటనపై నిరసన వెల్లువెత్తడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు. అదే విధంగా ఎస్ఐని సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. షోరూం నిర్వాహకుడు శ్రీనివాస్ పైనా కేసు నమోదు చేశారు.