ఎత్తా.. పొత్తా?

* పీకే-కేసీఆర్ చర్చల ఫలితమేంటి?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సీఎం కేసీఆర్ చర్చల్లో ఏం తేలింది.. ఎటు వైపు అడుగులు పడనున్నాయి.. పీకే రాయబారం ఫలించిందా.. ఎవరికి లాభం, ఎవరికి మోదం.. అన్న విషయాలపై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్ నగరంలో మకాం వేసిన ప్రశాంత్ కిషోర్ శని, ఆదివారాల్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కీలకమైన చర్చలు జరిపారు. ఆదివారం సాయంత్రంతో చర్చలు ముగిశాయి. అయితే అడుగులు ఎటువైపు పడనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

సీఎం కేసీఆర్ తో పీకే సుదీర్ఘ చర్చల్లో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారని తెలిసింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి, లేదా పార్టీ ఏర్పాటు పర్యవసానాలపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది.

ముఖ్యంగా బీజేపీని ఢీకొట్టే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీని కలుపుకోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ కోరినట్లు తెలిసింది.

బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దించే అవకాశముంటుందని పీకే వివరించారని సమాచారం. దీనికి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారని తెలిసింది.

అదే విధంగా రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ సంస్థ చేపట్టిన వివరాలను కేసీఆర్ ముందు పీకే ఉంచారని వినికిడి. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే వివరాలను కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది.

చర్చలు ఒక కొలిక్కి రాకపోయినా సానుకూల వాతావరణమే ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మరోసారి భేటీ కావాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పనిచేసే విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదనే తెలుస్తోంది.

రెండు రోజులుగా సాగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. పీకే మాత్రం ఇక్కడే ఉన్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.