రిటైర్మెంట్ వయసులో ఉద్యోగమొచ్చింది!

ఇదేంది.. ఎందుకిలా అంటే కొందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది.. అదే వీరికి జరిగింది. 1998 నాటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్నమాట. ఆనాడు ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఎంపిక జాబితానూ ప్రకటించారు.

కానీ కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో ఆనాడు ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరయింది. ఈ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు 1998 డీఎస్సీ ఎంపిక జాబితాలో పేరుంది.

ఉద్యోగం రాకపోవడంతో నాడు పెళ్లి కాలేదు. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉన్న ఇద్దరు తోబుట్టువులు దూరమయ్యారు. చేతి వృత్తి చేయూతనివ్వలేదు. ఓ పాత సంచిలో చొక్కాలు, డ్రాయర్లు, బనియన్లు అమ్ముతూ పొట్టపోసుకునేవాడు. అదీ జరగని నాడు బిక్షాటనే ఆయనకు గతి అయింది.

ఇప్పటికి ఆయన వయసు 57 ఏళ్లు. తాజాగా నాటి 1998 నాటి డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న కేదారేశ్వరరావుకు గ్రామస్థులే చెప్పడం కొసమెరుపు.

మాసిపోయిన షర్ట్, ప్యాంటో, షార్టో తెలియని బాటమ్, పాత సైకిల్ పై తిరిగే కేదారేశ్వరరావు తనకు ఉద్యోగమొచ్చిందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ దశలో చక్కగా ప్యాంటు, చొక్కా వేసుకొని ఎంచక్కా ఉద్యోగానికి రెడీ అయ్యాడు. చూశారా.. మలుపు తిప్పుకోలేని ఈ దశలో అతడి జీవితం మేలిమలుపు తిరగడం వింతే కదా.