బాసరలోని ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జోరు వర్షంలోనూ వారి ఆందోళన కొనసాగుతోంది. వారం రోజులు దాటినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయన లేఖ సారాంశం యథావిధిగా మీకోసం..
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ జైలు లాంటి జీవితం గడుపుతున్నారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదు.
సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే.. కరెంట్ నిలిపి వేసి, మంచి నీరు బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటువంటి చర్యలన్నీ ముమ్మాటికి మానవ హక్కలు ఉల్లంఘన కిందకే వస్తాయి.
బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మా లాంటి వారు వెళ్లి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకు రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు అణువణువునా పోలీసులను మొహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు.
ఇటువంటి నిర్భంద పరిస్థితుల్లో విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అంకుఠిత దీక్షతో తమ ఆందోళనను కొనసాగిస్తుంటే వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు.
మరో వైపు మీ పుత్ర రత్నం మంత్రి కేటీఆర్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారు. ఇది చెప్పి కూడా 5 రోజులు అయింది. ఎటువంటి అతీగతీ లేదు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. అని సూటు బూటు వేసుకొని పారిశ్రామికవేత్తలతో ఫొటోలు దిగుతుంటాడు.
గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఒక ఉన్నత విద్యా సంస్థ రాకుండా.. విద్యార్థులకు ఉన్నత విద్య అందని పరిస్థితిల్లో మీరు చెబుతున్న లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడ నుంచి విద్యార్ధులకు లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లక్షల ఉద్యోగాలకు ఎవరికి దక్కాయి?
మీ ప్రభుత్వ నిర్వాకం మూలంగా ప్రతిష్ఠాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి-గ్రేడ్ ర్యాంకుకు పడిపోయింది. న్యాక్ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొనడంతో పాటు యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయి.
మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇవన్నీ నిలిచి పోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యువతకు లక్షల ఉద్యోగాలు ఎటు నుంచి వస్తాయి.
దాదాపు 8 వేల మంది విద్యార్థులు అందోళన చేస్తుంటే భోజనం పెట్టబోమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. మరో వైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు సఫలం.. సోమవారం నుంచి విద్యార్ధులు తరగతులకు హాజరవుతారని సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేశారు.
విద్యార్థులు ఆగ్రహించడంతో ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. సోమవారం కూడా విద్యార్థుల ఆందోళనలు అలాగే కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ చర్చలు జరుపుతున్నా విద్యార్థులు నమ్మడం లేదు. రాతపూర్వక హామీ కావాలని పట్టుబడుతున్నారు.
ఇంత జరుగుతుంటే వేగంగా స్పదించాల్సిన మీరు అసలు రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదు. అసలు సమస్య గురించి మీకు తెలుసో లేదో కూడా తెలియదు. విద్యార్థులను ఆందోళన విరమించడానికి ఇప్పటి వరకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు.
అయినా విద్యార్థులు వెనక్కి తగ్గిలేదు. ఇక చివరగా దీర్ఘకాలిక సెలవులు ప్రకటించడమే పరిష్కారంగా భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంత కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు.
మీ రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి బీఆర్ఎప్ పేరిట గంటల తరబడి ఏసీ రూముల్లో చర్చించుకోవడానికి, తెలంగాణను వ్యతిరేకించిన శక్తులతో సమావేశానికి సమయం ఉంటుంది. తిరిగి అధికారంలోకి రావడానికి చేయాల్సిన కుట్రలు కుతంత్రాలపై పీకే వంటి వారితో చర్చించడానికి, ప్రత్యర్థులను అణగదొగ్గడానికి అనుసరించాల్సిన వ్యూహాలకు సమయం లభిస్తుంది.
కానీ బాసర ఐఐఐటీ విద్యార్థులు వారం రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళనలు చేస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం 5 నిమిషాల సమయం కేటాయించే తీరిక కూడా దొరకడం లేదా?
ఇటీవలి కాలంలో తమ మనోభావాలు దెబ్బతింటే సంబంధిత సమూహాలు ఎంతంటి చర్యలకైనా దిగడానికి వెనుకాడని సంఘటనలను చూస్తున్నాం.
అటువంటి పరిస్థితుల్లో బాసర విద్యార్థుల సమస్యను పరిష్కరించకుంటే మీరు రాష్ట్రంలో తిరగని పరిస్థితులు దాపురిస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కోరుకున్న డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి. లేని పక్షంలో నిరుద్యోగ గర్జన కంటే భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తుంది.
విద్యార్థుల డిమాండ్లు
• తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సిటీని సందర్శించాలి.
• రెగ్యులర్ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి.
• విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి.
• ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.
• ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి.
• తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి.
• ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి.
• మెస్‌ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి.
• పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.
– ఎ. రేవంత్ రెడ్డి,
మల్కాజ్ గిరి ఎంపీ,
టీపీసీసీ అధ్యక్షుడు.