నాన్న నువు దేశానికి బువ్వ పెట్టు.. నేను సేవ చేస్తా

వరంగల్ : నాన్న నువు దేశానికి బువ్వ పెట్టు.. నేను దేశానికి సేవ చేస్తా.. అని నా కొడుకు నిత్యం తండ్రితో అనేవాడు.. అని అగ్నిపథ్ నిరసనల సందర్భంగా సికింద్రాబాద్ పోలీస్ కాల్పుల మృతుడు దామెర రాకేశ్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది.

పోలీస్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా రాకేశ్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కొడుకును తలుచుకొని చెప్పసాగింది. దు:ఖసాగరంలో మునిగిన ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికీ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ మృతుడి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.

కుటుంబ సభ్యులను హైదరాబాద్ వరకు కూడా రానివ్వకుండానే మృతదేహాన్ని ఇంటికి పంపడం వెనుక కూడా అనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

“నాన్న నువు దేశానికి బువ్వ పెట్టు.. నేను దేశానికి సేవ చేస్తా.. అని ఇంట్లో తరచూ అనేవాడు” అని చెప్తూ రాకేశ్ తల్లి ప్రవీణ్ కుమార్ పై పడి కన్నీరు మున్నీరుగా విలపించడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అక్కడున్న వారిలో కూడా కన్నీటి సుడులు తిరిగాయి.