స్నేహం విలువ తెలిసిన ‘హితులు’

మిర్యాలగూడ : వారంతా పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఐక్యంగా ఆదుకుందామని ప్రతినబూనారు. అనుకున్నట్టుగానే ఎవరికి కష్టమొచ్చినా కలిసి పంచుకుంటున్నారు. ఆర్థికంగా తమకు తోచినంత సాయం చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అన్నారం (ఎన్) జడ్పీ హైస్కూల్ లో 1996-97లో పదో తరగతి చదువుకున్నారు. వారిలో ఇదే జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బొమ్మకంటి జానకిరాములు భార్య ఇందిరకు కళ్ల శస్త్ర చికిత్స చేయించాల్సి వచ్చింది.

కళ్ల శస్త్ర చికిత్స కోసం జానకిరాములు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తోటి క్లాస్ మేట్స్ స్పందించారు. అందరూ కలిసి జానకిరాములు కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి సేకరించిన రూ.50 వేలను ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్న జానకిరాములు కుటుంబానికి అందజేశారు.

గతంలో కూడా వీరంతా నారాయణగూడెం గ్రామానికి చెందిన మరో మిత్రుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే మేమున్నామంటూ చేయిచేయి కలిపి వైద్య చికిత్సల కోసం ఆర్థికంగా సాయం చేసి శభాష్ అనిపించుకున్నారు.

చూశారా.. ఇలాంటి మిత్రులు అభినందనీయులే కదా. తమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందుకొస్తున్న వారంతా హితులే కదా. మనవతామూర్తులే కదా. ప్రతీ ఒక్కరికీ ఇలాంటి మిత్రులుంటే ఒక భరోసా ఉంటుంది. జీవితమనే సముద్రాన్ని దాటేందుకు స్నేహాన్ని మించిన నావ లేదు. కలిసి ఉంటే కలదు సుఖం.

ఆర్థిక సాయం అందజేసిన వారిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మండల సైదులు (పండు), కోణం వెంకన్న, ఐతబోయిన రాంబాబు, నకిరేకంటి వెంకన్న, బోగరాజు వెంకట్, పల్లె భాస్కర్, బాదె లక్ష్మీనారాయణ, యడవెల్లి వెంకటరెడ్డి, కీత రాంబాబు, లింగాచారి, విజయకుమారి, సుజాత, మాధవి తదితరులు పాల్గొన్నారు.