కార్మిక జెండాను ఎగురేసిన సీఐటీయూ నేత అల్లి దేవేందర్

• శంకర్ పల్లిలో ఘనంగా మేడే వేడుకలు

రచ్చబండ, శంకర్ పల్లి: మే డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోమవారం సీఐటీయూ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ అల్లి దేవేందర్ కార్మిక జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో కార్మికులు, కార్మిక నాయకులు అమరులయ్యారని, వారి రక్తం నుంచి పుట్టిందే ఎర్రజెండా అని అన్నారు.

శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ, వివిధ రంగాల కార్మికులు ఐక్యంగా ఉంటూ తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు 21 వేల జీతం ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం 15,600 మాత్రమే చెల్లిస్తుందని అన్నారు.

ఇలాంటి వివక్షను ప్రభుత్వం వీడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగు మల్లారెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు సత్యం, మోహన్, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.