విమానంలో మహిళ ప్రసవం.. బిడ్డ పేరేంటో తెలుసా?

విమానంలో ప్రయాణ అనుభూతి వేరే ఉంటుంది. గాల్లో తేలుతూ ఉండటంతో ప్రయాణికులకు హాయిగా, ఆనందంగా, వెరైటీగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని అకస్మాత్తుగా అనుకోని ఘటనలు జరిగితే ఆ క్షణాలు మరుపురానివిగా మిగులుతాయి.

ఓ మహిళకు అలాంటి ఘటనే ఎదురైంది. గర్భిణి అయిన ఆ అమెరికా మహిళకు విమాన ప్రయాణంలోనే ఎదురైన అరుదైన ఘటన ఆమె జీవితంలోనే మరుపురానిది.. మధురమైనది.

షకేరియా మార్టిన్ అనే గర్భిణి అమెరికాలోని డెన్వర్ నుంచి ఒర్లాండోకోకు ప్రాంటియర్ ఎయిర్ లైన్స్ లో శనివారం ప్రయాణించింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.

విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గర్భిణి మార్టిన్ ప్రసవానికి సహకరించింది. సుఖ ప్రసవం జరగడంతో ఆ కుటుంబంతో పాటు తోటి ప్రయాణికులూ ఊపిరి పూల్చుకున్నారు.

ఇంతకూ విమానంలో పుట్టిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ఏం పేరు పెట్టారో తెలుసా.. ‘స్కై’ అని నామకరణం చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది. అంటే ఆకాశంలో పుట్టిన ఆ బిడ్డకు ఆకాశం అనే పేరు పెట్టడం విశేషమే కదా..