కేసీఆర్ పంజాబ్ రైతులకిచ్చే పరిహారమెంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజధాని నగరమైన ఢిల్లీలో సుమారు ఏడాది పాటు ఉవ్వెత్తున ఉద్యమం సాగింది. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు పెల్లుబికింది. సుదీర్ఘంగా సాగిన ఈ రైతు ఉద్యమ సమయంలో సుమారు 600 మంది రైతులు చనిపోయారు.

రైతు ఉద్యమ సమయంలో పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతులే అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఎట్టకేలకు రైతు ఉద్యమానికి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది.

అయితే ఉద్యమ సమయంలో చనిపోయిన పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఇస్తానని ఆనాడే కేసీఆర్ వెల్లడించారు. దీంతో సుమారు 600 మంది రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఆదివారం చండీఘడ్ వెళ్లారు.

ఈ మేరకు 600 మంది రైతు కుటుంబాల కోసం తెలంగాణ ఖజానా నుంచి రూ.18 కోట్లను సర్దుబాటు చేయాలి. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసం రాష్ట్ర సొమ్మను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై నిరసన వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నో ఘోర దుర్ఘటనలు జరిగినా సీఎం స్పందించలేదని ఆ వర్గం ఆరోపిస్తోంది. తమకు జరిగిన అన్యాయాలపై ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడినా కనీసం వారి కుటుంబాల వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. మరి పరాయి రాష్ట్రంలో జరిగిన ఘటనలపై స్పందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.