నువ్వా.. నేనా?

• కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ ఆవయించింది. ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. తన పాలనతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మార్క్ చూపుతూనే ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకడుగు ముందుకేసి ఎన్నికల శంఖారావం పూరించాయి. ముక్కోణంలో రాజకీయ వేడి పుట్టి రాష్ట్రం కాగుతూనే ఉంది.

ఈ దశలో కాంగ్రెస్, బీజేపీలు తాజాగా నిర్వహించిన బహిరంగ సభలు ఎన్నికల సభలనే తలపించాయి. అగ్రనేతల ప్రసంగాలూ ఎన్నికల ప్రచార సభలను మరిపించాయి. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పోటీపడేది నువ్వా, నేనా.. అన్న పట్టుదల ప్రధానంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలో నెలకొంది.

ఈ సమయంలో అసంతృప్త వాదులను చేర్చుకునేందుకు ఆ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓ దశలో వేగం కూడా పెంచాయని అనవచ్చు. ఈ పోటీలో ఉత్తర తెలంగాణ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు కుటుంబాన్ని తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఫలించింది.

చేరికల విషయంలో వెనుకపడొద్దని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఒకరి చేయి జారితో మరో పార్టీలో చేరే అవకాశముందని రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో మంతనాలు షురూ చేశాయి. వివిధ జిల్లాల్లో ముఖ్య నేతలతో రాష్ట్ర అగ్రనేతలు టచ్ లోకి వెళ్లారు.

దీంతో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని కొందరు ముఖ్య నేతలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలు సంప్రదింపులు షురూ చేశారు. వారు కూడా బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పార్టీ ఏది అని విశ్లేషించుకుంటున్నట్లు తెలిసింది.