బురిడీ బాబా నిర్వాకం.. బాలికకు ప్రాణాపాయం

పరిగి : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడింది.. అన్న సామెత మనవాళ్లకు తెలుసు.. మంత్రాలకు చింతకాయలు రాలవు.. అన్న విషయమూ తెలుసు.. కానీ నేటి ఆధునిక సమాజంలో ఇంకా మూడనమ్మకాల వంచనకు ఎందరో గురవుతూనే ఉన్నారు.

ఓ బురిడీ బాబా చేసిన నిర్వాకం వల్ల ఓ బాలిక ప్రాణాల మీదికే వచ్చింది. మంత్రాలతో జబ్బు నయం చేస్తానంటూ పెట్టిన మంటల కుంపటి ఆ అమ్మాయి ప్రాణాలకే సంకట స్థితి తెచ్చింది.

మరి ఈ ఘటన ఎక్కడో జరగలేదు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉన్న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో చోటుచేసుకోవడం గమనార్హం.

వికారాబాద్ జిల్లా దారూరు మండలం కుక్కింద గ్రామంలో ఓ బాలికకు అనారోగ్యం చేసింది. పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. ఈలోగా పరిగి మండలం నష్కల్ గ్రామానికి చెందిన తన బంధువుకు ఆ తల్లిదండ్రులు విషయం చెప్పారు.

అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఆ బంధువు ద్వారా అదే గ్రామానికి చెందిన రఫీక్ అనే బాబా వద్దకు ఆమెను తీసుకెళ్లారు. మంత్రతంత్రాలతో నయం చేస్తానని అతను వారిని నమ్మబలికాడు. ఈనెల 13న ఆ బాలికను ఆమె కుటుంబ సభ్యులతో తన చేను వద్ద ఉన్న దర్గా వద్దకు తీసుకెళ్లాడు.

దర్గా వద్ద నిప్పుల కుంపటి ఏర్పాటు చేసి, దానికి సమీపంలో ఆ బాలికను కూర్చొబెట్టాడు. ఆ బాలిక కాళ్లను, ఎడమ చేతిని కుంపటిపై పెట్టించి, అతను సవారీ ఊగుతూ ఏవేవో మంత్రాలు చదివాడు. కొంతసేపయ్యాక ఇక నయం అవుతుంది తీసుకెళ్లమని చెప్పి పంపాడు.

అసలు సమస్య ఇప్పుడే వచ్చి పడింది. అనారోగ్యం కుదుట పడకపోగా ఆ బాలిక కాళ్లు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. లబోదిబోమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడా బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు బురిడీ బాబాపై గురువారం పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి బాబా చర్యలను ఎవరూ నమ్మవద్దని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ప్రజలకు హితవు పలికారు.